ఆ టిక్కెటు మా అల్లుడుకి ఇస్తారా లేదా? : నాయినీ

11:25 - October 12, 2018

ముషీరాబాద్‌ టికెట్‌ను తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి ఇవ్వడంలో సీఎం కేసీఆర్‌కు ఇబ్బంది ఉంటే తనకు ఇస్తే పోటీ చేస్తానని నాయిని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పని చేసుకోమని శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్‌ సంవత్సరం క్రితమే చెప్పారని తెలిపారు. గురువారమిక్కడ ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రిని విలేకర్లు ముషీరాబాద్‌ టికెట్‌పై ప్రశ్నించగా.. మనసులోని మాటను పంచుకున్నారు. 2014 తాను ముషీరాబాద్‌ నుంచి పోటీ చేస్తానంటే ' వద్దు నర్సన్నా, నిన్ను గతంలో ఓడగొట్టారు. నువ్వు ఈసారి ఎల్బీనగర్‌ నుంచి పోటీ చెయ్యి ' అని కేసీఆర్‌ అన్నారన్నారు. బాగా డబ్బున్న సుధీర్‌రెడ్డి మీద పోటీ చేయలేనంటే.. ' నీ తమ్ముడిని నేనున్నా. రూ.10 కోట్లు ఇస్తా. పోటీ చెయ్యి' అని చెప్పారని నాయిని తెలిపారు. వద్దనడంతో ' ఎమ్మెల్సీగా చేసి నా కేబినెట్‌లో ఉంచుకుంటానన్నడు. దాని ప్రకారమే కేసీఆర్‌ చేశారు' అని నాయినీ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నానని.. కలిసినప్పుడు అన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.