ఆర్‌జీవీ తీస్తున్న ' లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ' వల్ల లక్ష్మీ పార్వతికి టెన్షన్‌

14:07 - December 21, 2018

ఓ పక్క కథానాయకుడు సినిమాను కంప్లీట్ చేసి దాన్ని ఆగమేఘాలమీద రిలీజ్ చేసేందుకు బాలయ్య ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు.. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు పోటీగా తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు తయారైంది. అయితే.. వర్మను ఏమాత్రం నమ్మలేం. నెలరోజుల్లో సినిమా తీసి రిలీజ్ చేయగల సత్తా వర్మకుంది.  కానీ ఇప్పుడు వర్మ.. అసలు ఏ స్టోరీతో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీయబోతున్నాడు అందులో కథేంటి - లక్ష్మీ పార్వతి కోణంలో ఉంటుందా లేదా..? అనేదే ప్రశ్నార్దకంగా మారింది. లక్ష్మీ పార్వతి మాత్రం.. వెన్నుపోటు కథాంశంతోనే సినిమా వర్మ తీయబోతున్నాడని.. ఇందులో విలన్ చంద్రబాబేనని చెప్పారు. గతంలో తాను రాసిన పుస్తకం ఆధారంగానే మూవీ ఉంటుందని వర్మ అదే పుస్తకంలోని కథతోనే సినమా తీస్తాడని చెప్తున్నారు. వర్మ మాత్రం లక్ష్మీ పార్వతి మాటల్ని చాలా లైట్ తీసుకుంటున్నాడు. ఇంతవరకు లక్ష్మీపార్వతికి కథ చెప్పలేదని.. అసలు చెప్పాల్సిన అవసరం లేదంటూ తన స్టైల్లో సమాధానం ఇచ్చాడు.  ప్రాజెక్టుకు హైప్ వచ్చేవరకు లక్ష్మీ పార్వతి పేరు ప్రస్తావించిన వర్మ.. ఇప్పుడు మాత్రం ఆమె గురించి మాట్లాడడమే మానేశాడు. వర్మ అంతే.. తాను అనుకున్నదే తీస్తాడు. చివరకు హీరోని విలన్ లా - విలన్ ని హీరోలా మార్చగల సత్తా ఉంది అతనికి. అందుకే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ని వర్మ ఎలా తీస్తాడా.. తన స్టోరీ ఆధారంగా తీస్తాడా లేదంటే సొంతానికి తీసుకుంటూ పోతాడా అనేది లక్ష్మీ పార్వతికి టెన్షన్ గా మారింది.