ఆంధ్రా పోలీసులు మాత్రం వద్దు...

12:11 - October 30, 2018

ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలు జరుగుతుంటే పొరుగు రాష్ట్రాల నుంచి పోలీసు బలగాలను రప్పించుకోవడం కామన్ విషయం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు కూడా పొరుగు రాష్ట్రాల బలగాలు విచ్చేయనున్నాయి. ఎన్నికల వేళ తమ వంతు బందోబస్తు నిర్వహించనున్నాయి. అయితే తెలంగాణకు విచ్చేయనున్న బలగాల్లో ఆంధ్రప్రదేశ్ బలగాలు లేకపోవడం గమనార్హం. స్వయంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రా పోలీసులను ఈ దఫా ఎన్నికల విధులకు తీసుకోబోమని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు తెలంగాణాకు చెందిన 70 వేల మంది పోలీసుల సేవలను వినియోగించుకుంటామని రజత్‌ కుమార్‌ వెల్లడించారు. వారితో పాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడ, ఒడిశా నుంచి బలగాలను రప్పిస్తామని చెప్పారు. 307 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపాల్సిందిగా తాము కేంద్రాన్ని కోరామని...250 బలగాలకు ఆమోదం ఇప్పటికే ఆమోదం లభించిందని తెలిపారు. ఆంధ్రా పోలీసులను తెలంగాణలో ఎన్నికల విధుల్లోకి తీసుకోబోమంటూ రజత్ కుమార్ తీసుకున్న నిర్ణయం వెనుక చాలా కారణాలున్నాయి. కొన్ని రోజుల కిందట జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యక్షమయ్యారు. వారు కొందరికి డబ్బులు పంచుతుండగా తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారాన్ని ఎన్నికల సంఘానికి చేరవేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఈసీ.. తెలంగాణలో ఏపీ నిఘా వర్గాల సంచారం ఓటర్లను ప్రలోభపెట్టడంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో ఆంధ్రా పోలీసుల సాయాన్ని తెలంగాణ ఎన్నికల్లో తీసుకోకూడదని ఈసీ నిర్ణయించింది.