అసలు విషయం చెప్పని హాస్య బ్రహ్మ

12:29 - October 7, 2018

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సినిమాలో వుంటే ఇక నవ్వులకు కొదవే వుండదు. స్టార్ హీరోలు సైతం బ్రహ్మానందం కోసం ప్రత్యేక పాత్రను దర్శకులతో రాయించేవారు - తమ సినిమాల్లో బ్రహ్మానందం ఉండాల్సిందే అంటూ ఎంతో మంది హీరోలు గతంలో దర్శకులతో చెప్పిన మాట అందరికి తెల్సిందే. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బ్రహ్మానందం కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం లేదు. బ్రహ్మానందం ఏ పాత్ర చేసినా ప్రేక్షకులు దానిని ఒకేలాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. కొత్త ఎంజాయ్మెంట్‌ వారికి దొరకడంలేదు. దీంతో మన బ్రహ్మీ గత రెండు సంవత్సరాలుగా తక్కువ సినిమాల్లో కనబడుతున్నారు.  బ్రహ్మానందం చివరి సంవత్సర కాలంలో నటించిన సినిమాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. ఆ సినిమాల్లో కూడా ఒకటి రెండు కూడా ఆకట్టుకునే పాత్రలు కావని చెప్పక తప్పదు. ఇలాంటి సమయంలో బ్రహ్మానందం బుల్లి తెర అరంగేట్రంకు సిద్దం అయ్యాడు. ‘లాఫ్టర్ ఛాలెంజ్’ అనే షోతో స్టార్ మా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మానందం పాల్గొన్నాడు. ప్రెస్ మీట్ లో సినిమాలను తగ్గించడానికి కారణం అడిగిన సమయంలో ఆయన సమాధానం ఎలా వుందంటే..ఆ సమాధానంపై సోషల్‌ మీడియాలో కామెంట్స్‌తో కామెడీ చేసేలా వుంది. ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. నటుడిగా ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో - ఎన్నో పాత్రల్లో నటించాను. కాని ప్రస్తుతం మాత్రం నాకు ఆనందాన్ని ఇచ్చే పాత్రలను మాత్రమే చేస్తున్నాను ఇబ్బందిగా అనిపించినవి చేయలేను అంటూ చెప్పేస్తున్నాను. కొత్తగా వచ్చే వారికి ఛాన్స్ లు రావాలనే ఉద్దేశ్యంతో తాను సినిమాల సంఖ్య తగ్గించుకున్నట్లుగా బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో జోకులు పేళుతున్నాయి. బ్రహ్మీ సినిమాల్లో కాకున్నా మీడియా ముందు కామెడీ చేశాడు. ఇప్పుడు ఆయనకు ఆఫర్లే లేకున్నా కూడా కొత్త వారి కోసం తాను తగ్గించుకున్నట్లుగా చెబుతుండటం హాస్యాస్పదంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  ఏది ఏమైనా ఇంత కాలం తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం ఇకపై బుల్లి తెరపై  తన కామెడీ షోలతో నవ్వించాలని కోరుకుందాం.