అరుదైన అవకాశాన్ని చేజార్చుకున్న సీపీ మహేష్‌ భగవత్‌

10:51 - October 10, 2018

ఏటా అమెరికా ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఐఏసీపీ అవార్డుకు మన దేశం తరపున రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఎంపికయ్యారు. సోమవారం అమెరికాలోని ఓర్‌లాండోలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రధానం చేయనున్నారు. అందుకుగాను అమెరికాకు రావాల్సిందిగా సీపీకి ఆహ్వానం అందింది. కానీ మహేష్‌ భగవత్‌ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే ముందస్తు ఎన్నికలు, పనుల ఒత్తిడి, కోడ్‌ ఆఫ్‌ కాండక్టు అమల్లో ఉండటంతో అమెరికా ప్రయాణాన్ని సీపీ రద్దు చేసుకున్నారు. అసలు మహేష్‌ భగవత్‌కు ఆ అరుదైన అవకాశం ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం... ఒడిశా రాష్ట్రం నుంచి వేలాది మంది కార్మికులు హైదరాబాద్‌ నగరానికి వలస వస్తుంటారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఇటుకల బట్టీల్లో పిల్లలతో సహా కూలీలుగా పనిచేస్తుంటారు. ఈ నేపఽథ్యంలో కార్మికుల పిల్లలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి, వారికోసం ప్రత్యేకంగా వర్కుసైట్‌ స్కూళ్లు ఏర్పాటు చేయించారు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌. ఒడియా భాషలో చదువు చెప్పించేలా చర్యలు తీసుకోవడం, ఏయిడ్‌ ఎట్‌ యాక్షన్‌ స్వచ్చంద సంస్థ, ఇటుకల బట్టీల యజమానులు, రెవెన్యూ డిపార్టుమెంట్‌ను సమన్వయం చేసి వలస కార్మికుల పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఇప్పటి వందలాది మంది చిన్నారులకు ఒరియా భాషలో విద్యనందించే విధంగా చర్యలు తీసుకున్నారు. దాంతో మహేష్‌ భగవత్‌ను అమెరికా ప్రభుత్వం ఈ అరుదైన అవార్డుకు ఎంపిక చేసింది. ఇదిలా వుంటే... ఓర్‌లాండోలో సోమవారం జరిగిన అవార్డు ప్రధానోత్సవానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 100కు పైగా దేశాల నుంచి వచ్చిన పోలీస్‌ ఉన్నతాధి అధికారులు పాల్గొన్నారు. మహేష్‌ భగవత్‌ ఈ కార్యక్రమానికి హాజరై ఉంటే ట్రంప్‌ చేతుల మీదుగా అవార్డు అందుకునే వారు. అమెరికా రాలేకపోయిన సీపీకీ అవార్డును పోస్టులో పంపిస్తామని ఐఏసీపీ స్పష్టం చేసింది.