అమెరికాలో తెలుగు భాష హవా

13:52 - September 21, 2018

రెండు తెలుగు రాష్ర్టాలతో సహా తెలుగు బిడ్డలు అమెరికాలో మెజార్టీ సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా మనవాళ్లందరి లెక్క కొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలో జరిగిన ఓ సర్వేలో మొత్తం భారతీయుల్లో మూడో వంతు తెలుగు భాష మాట్లాడేవారున్నారని తేలింది. అమెరికాలో ఉన్న భారతీయుల్లో  హిందీ - గుజరాతీ మాట్లాడే వారు ఒకటి రెండో స్థానాల్లో ఉండగా...తెలుగు భాష మాట్లాడే వారు మూడో స్థానంలో ఉన్నారు. 2017లో అమెరికా కమూనిటీ చేసిన సర్వే ఫలితాలను యూఎస్ సెన్సస్ బ్యూరో తాజాగా విడుదల చేసింది. జూన్1 - 2017 నాటికి అమెరికా మొత్తం జనాభా 30.5 కోట్లలో 6.7 కోట్ల మంది తమ ఇంట్లో విదేశీ భాష మాట్లాడుతారట. ఈ విదేశీ భాషల్లో భారతీయుల విషయానికి వస్తే హిందీ మాట్లాడే వారి సంఖ్య8.63 లక్షలు ఉండగా - 4.34 లక్షల మంది గుజరాతీ భాష మాట్లాడే వారు 4.15 లక్షలమంది తెలుగు మాట్లాడే వారున్నారు.  2010 నుంచి దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగిందని పేర్కొంది. హిందీ 42% - గుజరాతీ 22% పెరగగా...తెలుగు మాట్లాడే వారి సంఖ్య 86% పెరిగిందని వివరించింది. ఇదిలావుంటే...2001 నుంచి లెక్కలను గమనిస్తే - అమెరికా ఇస్తున్న మొత్తం హెచ్1బీ వీసాల్లో 50 శాతం భారతీయులకే దక్కుతున్నాయని పేర్కొంది.  అమెరికాలో నివసిస్తున్న వారిని - వారి కుటుంబాలు కూడా కలుపుకొని లెక్కేస్తే దాదాపు ఒక మిలియన్ జనాభా తెలుగు వారే ఉంటారని అందుకే ఇంత పెద్ద ఎత్తున తెలుగు భాష వృద్ధి చెందిందని ఈ నివేదికపై పలువురు ఎన్నారైలు అభిప్రాయపడుతున్నారు.