అభ్యర్థులు గల్లీల బాట పట్టే టైం వచ్చిందహో..!

10:43 - November 28, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. దీంతో పార్టీల అభ్యర్థులు ప్రచారాలని వేగవంతం చేశారు. సభలు పెట్టి ప్రజలను అక్కడకి రప్పించుకోని ఓట్లేయ్యమనటం ఒక విధానం అయితే, దీనిని కూడా మించి అభ్యర్థులు డైరెక్ట్‌గా ఓటర్ల దగ్గరకు వెళ్లి అడగడం మొదలుపెట్టారు.  ఇక ఈ నేపథ్యంలో అభ్యర్థులు గల్లీల బాట పట్టడం మొదలు పెట్టారు. పాపం గత ఎన్నికల్లో చూసిన ఓటర్లను మల్లీ ఇప్పుడు చూస్తున్నట్లున్నారు అభ్యర్థులు. మళ్లీ ఇప్పుడు చూస్తే ఇంకెప్పుడు వస్తారో...!. ఎప్పుడేముంది మళ్లీ వచ్చే ఎన్నికలకు కనబడతారులేండీ. అదిస్తాం, ఇదిస్తాం అని చెప్పి ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటరు లిస్టులో పేరుందా...? అయితే, పలు పార్టీల నేతలు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. తమ అభ్యర్థిని గెలిపించాలని విన్నవించుకుంటారు. పలు పార్టీల అభ్యర్థులు ఓటరు జాబితా ఆధారంగా ప్రచారానికి తెరలేపారు. ఉదయం, సాయంత్రం కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తున్నారు. కుల, యువజన, కాలనీ సంక్షేమ సంఘాలతో అభ్యర్థులు భేటీ అవుతున్నారు. అడిగిందల్లా ఇస్తాం. మీ మద్దతు మాకే ఉండాలంటూ గెలుపు మార్గాలను వెతుకుతున్నారు. ఏ బూత్‌ పరిధిలో ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయో లెక్కలు తీసి ప్రచారం చేస్తున్నారు. వెయ్యి నుంచి 1200 వరకు ఓట్లు ఉన్న ఒక బూత్‌ కన్వీనర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ పరిధిలోని ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించడం వారి బాధ్యత. ఆ మేరకూ గిఫ్ట్‌లు ఇవ్వడం, పోలింగ్‌ తేదీ వరకు టచ్‌లో ఉండడం వంటివి చేస్తున్నారు. తమ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో ఒక్క ఓటూ మిస్‌ అవకుండా ముఖ్యనేతలు పక్కాగా వ్యవహరిస్తున్నారు. బూత్‌ల వారీగా తమకు అనుకూల ప్రతికూల అంశాలపై దృష్టి సారిస్తున్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కడెన్ని ఓట్లు పడ్డాయి, ప్రస్తుత పరిస్థితి ఏంటనేదానిని విశ్లేషించుకుని బూత్‌స్థాయి నుంచి ఓట్లు పెంచుకునే మార్గాలను అన్వేశిస్తున్నారు.