అభ్యర్థులకు సైబర్‌ క్రైం పోలీసుల హెచ్చరికలు...

10:56 - November 20, 2018

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈనెల 19తేదీన అన్ని పార్టీల అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్లు వేయడం కూడా ముగిసింది. ఇక డిసెంబర్‌ 7న జరగబోయే పోలింగ్‌ గురించి అన్ని పార్టీల వారూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగానే అభ్యర్థులకు సైబర్‌ క్రైం పోలీసులు కొన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారం కోసం సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని, హద్దు మీరితే జైలుకెళ్లక తప్పదని హెచ్చరించారు. అభ్యర్థులు ఐటీ చట్టానికి లోబడే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవాలని సూచించారు. ప్రత్యర్థుల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం నేరమన్నారు. ఐటీ చట్టం ప్రకారం ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు పెడితే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  చాలామంది ప్రత్యర్థులపై బురద జల్లడానికి, విషం చిమ్మడానికి సోషల్‌ మీడియాను వేదికగా మార్చుకుంటున్నారని పేర్కొన్న పోలీసులు.. నిబంధనలను ఉల్లంఘించి కోరి కష్టాలు తెచ్చుకోవద్దని హితవు పలికారు.