అభిమానులకు ఆఖరి లేఖ

11:06 - August 29, 2018

బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీనియర్‌ నటులు నందమూరి హరికృష్ణ మరణించారు. హరికృష్ణ మరణంతో టాలీవుడ్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. మరో నాలుగు రోజుల్లో (సెప్టెంబర్‌ 2) తన పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ ఇలా అర్థాంతరంగా మృతిచెందటంతో నందమూరి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. 62వ పుట్టిన రోజును జరుపుకోబోతున్న హరికృష్ణ ...అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను సిద్ధం చేశారు. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది మరణించారు. వేల మంది  నిరాశ్రయులైనారు. ఇది మన అందరికి ఎంతో విషాదాన్ని కలిగించిన విషయం. అందు చేత నా జన్మదిన సందర్భంగా బేనరులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గచ్ఛాలు, దండలు తీసుకు రావద్దని వాటికి అయ్యే ఖర్చుని వరదలు, వర్షాల వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను’ అంటూ ఓ పత్రికా ప్రకటనను సిద్ధం చేశారు. ఈ ప్రకటన వెలువడకకుందే ఆయన మనందరికీ దూరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.