అప్పుడు చిరంజీవి-చంద్రమోహన్‌...ఇప్పుడు వెంకటేష్‌-రాజేంద్రప్రసాద్‌

11:50 - December 20, 2018

స్టార్ హీరోలకు తెరమీద వయసు నిబంధన ఉండదు. ముప్పై నుంచి అరవై దాకా ఎంత ఏజ్ ఉన్నా హీరొయిన్స్ తో డ్యూయెట్లు రొమాన్స్ ఉంటేనే ప్రేక్షకుడు ఒప్పుకుంటాడు. అది హీరొయిన్లకు వర్తించదు. ఇదిలా వుంటే...సమాంతరంగా కెరీర్ మొదలుపెట్టి ఒకేసమయంలో హీరోలుగా వెలిగిన ఇద్దరు లేదా ముగ్గురు కాలక్రమేణా కొత్తరకాల ఇమేజ్ లు సంతరించుకోవడం సహజం. ఇది క్లియర్ గా అర్థం కావాలి అంటే ఈ ఉదాహరణలు చూడండి. చిరంజీవి చంద్రమోహన్ 80వ దశకంలో కలిసి సినిమాల్లో నటించారు. ఒకరకంగా ఆ టైంలో వచ్చిన మల్టీ స్టారర్స్ అని చెప్పొచ్చు. చెరో హీరొయిన్ సమానంగా పాటలు ఉండేవి. కట్ చేస్తే 1999లో వచ్చిన ఇద్దరు మిత్రులులో చంద్రమోహన్ తండ్రిగా చిరంజీవి కొడుకుగా నటిస్తే ప్రేక్షకులు ఎబ్బెట్టుగా ఫీలవ్వలేదు. ఇమేజ్ లో వ్యత్యాసం అది. ఇప్పటికీ చిరు సరసన కాజల్-నయనతార లాంటి వాళ్ళు జట్టు కడుతూనే ఉన్నారు. ఇప్పుడు వెంకటేష్ వంతు వచ్చింది. వెంకటేష్ హీరోగా పరిచయమైన సంవత్సరంలో రాజేంద్రుడు హీరోగా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అప్పటి నుంచి మరో పదేళ్ల వరకు సోలో హీరోగానే ప్రస్థానం సాగింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. వెంకీ మాత్రం ఇంకా హీరోగానే కంటిన్యూ అవుతున్నారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్ తో చేస్తున్న మూవీగా ఎఫ్2 మీద అభిమానులకు ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. ఇందులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన హీరోలకో లేక హీరోయిన్లకో తండ్రి కావొచ్చు. కానీ వెంకీ మాత్రం ఇంకా యంగ్ గా రచ్చ చేస్తూ ఏకంగా మిల్కీ బ్యూటీ తమన్నాతో జోడి కట్టేసాడు. ఇదే కాల మహిమ అంటే.