అన్ని లెక్కలూ బయటపెడతాను: విశాల్‌

13:31 - December 20, 2018

నిన్న తమిళనాడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వద్ద విశాల్ లేని సమయంలో అతని అసమ్మతి వర్గం బలవంతంగా తాళాలు వేసి నిరసన ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాల్ 2015లో ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. నిన్న నగరంలో లేని కారణంగా  విశాల్ ఇవాళ నేరుగా ఆఫీస్ వద్దకు చేరుకొని తాళాలు తీసే ప్రయత్నం చేసాడు. అయితే అప్పటికే ఉన్న టైట్ పోలీస్ సెక్యూరిటీ ఆ పనిని చేయకుండా అడ్డుకుంది. దీంతో పోలీసులకు విశాల్ కు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. ఎవరో బయటి వ్యక్తులు తాళం వేసి పారిపోతే లోపల ఆస్తులకు మీరు గ్యారెంటీ ఇస్తారా అంటూ నిలదీయడంతో ఫైనల్ గా వ్యవహారం అరెస్ట్ గా వచ్చింది. ప్రతిఘటించకుండా విశాల్ పోలీస్ వ్యాన్ ఎక్కేసాడు. త్వరలో బిల్డింగ్ ఫండ్ కోసం ఇళయరాజాతో చేయాలనుకున్న కార్యక్రమం జరగకుండా అడ్డుపడేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విశాల్ మండిపడుతున్నాడు. ప్రత్యర్థులు ఆరోపిస్తున్న 8 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించి అన్ని లెక్కలు జనరల్ బాడీ మీటింగ్ లో బయటపెడతామని చెబుతున్న విశాల్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఇప్పుడు ఇది కోలీవుడ్ వాతావరణాన్ని వేడెక్కించింది. కమల్ హాసన్ సైతం వ్యక్తిగతంగా ఏం జరిగింది అని ఆరా తీస్తున్నట్టు తెలిసింది. మొత్తానికి విశాల్ నడిగర్ సంఘం నిర్మాతల సమాఖ్యలో తనదైన శైలిలో మార్పులు తీసుకురావడం ఓర్వలేకే ఈ కుట్రలు చేస్తున్నట్టు విశాల్ మద్దతుదారులు అంటున్నారు. సాయంత్రం లోపు ఈ విషయంగా చాలా పరిణామాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. మీడియా మొత్తం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉన్న టి నగర్ వద్దే కాపు కాసింది.