అక్కడ పెట్రోల్‌ రూ.150.. వాటర్‌ క్యాన్‌ రూ.60

16:46 - October 15, 2018

మూలిగే నక్క మీద తాటికాయ పడిన సందంగా వుంది ఇప్పుడు సిక్కోల పరిస్థితి. అసలే తితలీ బీబత్సానికి అన్నీ కోల్పోయి సహయం కోరుతున్న సిక్కోలును అక్కడ వ్యాపారస్తులు మరింతగా బాదలకు గురిచేస్తున్నారు. తుఫాను తీవ్రత తగ్గి నాలుగు రోజులు అవుతున్నా.. అది మిగిల్చిన కష్టం నుంచి మాత్రం అక్కడి ప్రజలు ఇప్పటికి తేరుకోలేదు. తితలీ పుణ్యమా అని రవాణా స్తంభించిపోవటంతో ఉన్న వస్తువుల్ని వీలైనంతగా దోచేసుకునేలా అమ్ముతున్న వ్యాపారుల కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూ.5 గుడ్డు ఇప్పుడక్కడ రూ.10.. అంతేనా.. నిన్న మొన్నటి వరకూ 20లీటర్ల వాటర్ క్యాన్ రూ.10 నుంచి రూ.20 అయితే.. ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి రూ.100 వరకూ  వాయించేస్తున్నారు. ఇక.. పెట్రోల్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. లీటరు రూ.150 చొప్పున అమ్మేస్తున్నారు. టమోటా కిలో రూ.40.. కూరగాయల ధరల్ని ఆకాశాన్ని అంటేలా ధరలు చెప్పి బాదేస్తున్నారు. ఇక.. పాలు గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆదివారం నాటికి కూడా దాదాపు 1300 గ్రామాలకు విద్యుత్ సరఫరా లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.  కూరగాయల ధరలు మండిపోతున్న వేళ.. కాస్త ఆర్థిక స్థితి బాగున్న వారు ఏదో ఒకరకంగా కొనుగోలు చేస్తుంటే.. ఇక పేదోళ్లు అయితే చెట్లకు ఉన్న బొబ్బాయి కాయల్ని తుంచేసి వాటిలో ఏదో ఒక కూర చేసుకొని ఆకలి బాధ నుంచి బయట పడే ప్రయత్నం చేస్తున్నారు.