అంతరిక్షంలో వరుణ్‌ తేజ్‌

15:29 - August 31, 2018

వరుణ్‌ తేజ్‌ అండ్‌ టీమ్‌...అంతరిక్షంలోకి వెళ్లడానికి సుదీర్ఘమైన చర్చలు జరుపుతున్నారు. అది ఎందుకో తెలియాలంటే  కొన్ని రోజులు నిరీక్షించాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంతరిక్షం 9000 కిమీ’. స్పేస్‌లో జరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై దర్శ కుడు క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన ఆఫీస్‌ సెట్లో షూటింగ్‌ జరుపుతోంది చిత్రబృందం. వరుణ్‌ తేజ్, అవసరాల శ్రీనివాస్‌ మరికొందరు నటీనటులు పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఆఫీస్‌కు సంబంధించిన సెట్లోనే షూటింగ్‌ జరపనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం ప్రశాంత్‌ ఆర్‌. విహారి అందిస్తున్నారు. డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానున్న ఈ సినిమా షూటింగ్‌ ఇంకొక్క షెడ్యూల్‌ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం.