ఈ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయ్: పౌరసత్వ బిల్లుపై దద్దరిల్లిన లోక్ సభ

17:44 - January 8, 2019

 కీలకమైన పౌరసత్వ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. అస్సాంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పౌర‌స‌త్వ బిల్లుపై త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. అక్ర‌మ వ‌ల‌స‌దారుల వ‌ల్ల అస్సాం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు త‌మ‌కు తెలుసు అని, పౌర‌స‌త్వ బిల్లుతో ఎవ‌రూ వివ‌క్ష‌కు గురికారు అని రాజ్‌నాథ్ తెలిపారు. పౌర‌స‌త్వ బిల్లును సవ‌రించేందుకు దేశ‌వ్యాప్తంగా ఎన్జీవోలు, ఇత‌ర సంస్థ‌లు స‌ర్వేలు నిర్వ‌హించిన‌ట్లు మంత్రి తెలిపారు.  

     అయితే బిల్లును సెలెక్ట్ క‌మిటీకి పంపాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఈ డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం అంగీక‌రించ‌క‌పోవ‌డంతో.. కాంగ్రెస్ పార్టీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. మ‌రోవైపు ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ ఇప్ప‌టికే ఈశాన్య రాష్ట్రాలు భ‌గ్గుమంటున్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించింది.పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేస్తూ ఇప్పటికే లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. 
           ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన మైనార్టీలు (హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు) భారత్‌లో ఆరేడేళ్లుగా నివసిస్తుంటే..వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ డాక్యుమెంట్లు లేకున్నా భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఐతే ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలు..ముఖ్యంగా అసోంలోని చాలా వర్గాలు, సంస్థలు పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుతో తమ అస్సామీల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తమ ఉనికి దెబ్బతినే ప్రమాదముందని అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.  

             ఈ దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ర్టాలకు చెందిన పార్టీలు.. బీజేపీ మిత్రపక్షాలు కూడా ఈ బిల్లును తప్పుబట్టాయి. ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలకు విరుద్ధమైన బిల్లు అని వాదించాయి. అస్సాంలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.  పౌరసత్వం బిల్లుతో అసోం ప్రజల ఉనికి ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందని..ఆ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేసినా బీజేపీ హైకమాండ్ పట్టించుకోలేదని వాపోయింది అసోం గణ పరిషద్ అస్సామీ ప్రజల ప్రయోజనాల ముఖ్యమని.. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఐతే బీజేపీ మాత్రం బిల్లును ఆమోదింపజేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

బీజేపీ మిత్రపక్షంగా ఉన్న అసోంగణ పరిషద్ కూడా బిల్లును వ్యతిరేకిస్తూ కమలానికి దూరం జరిగింది. ఈ బిల్లును హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ బిల్లు విభజనకు, హింసకు కారణమవుతుందని తృణమూల్ కాంగ్రెస్ వాదించింది. ముస్లింలు కాకుండా ఆరు ఇతర మతాల వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. అయితే దేశంలో ఎవరు ఆశ్రయం కోరినా ఇవ్వాలని, ఇందులో ముస్లింలను కూడా చేర్చాలని టీఎంసీ డిమాండ్ చేసింది.