జయరాం హత్యకేసులో సినీ నటుడు

12:24 - March 14, 2019

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపార వేత్త - ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో తీగ లాగితే డొంక అంతా కదులుతోంది. ఈ హత్య కేసులో సినీనటుడు సూర్య ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు ఇతనితో పాటు కిషోర్ మరియు అంజిరెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఈ ముగ్గురిని రేపు మీడియా ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే సేకరించిన విషయాలతో పాటు - ఇంకా తేలాల్సిన విషయాలను రేపు పోలీసులు వెళ్లడించే అవకాశం ఉంది. సినీ నటుడు సూర్య ప్రసాద్ కు హత్యలో భాగస్వామ్యం ఉందని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. తాజాగా అతడి అరెస్ట్ తో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. వీరు ప్రత్యక్షంగా హత్యలో పాలు పంచుకోకున్నా కూడా హత్య కుట్రలో వీరు భాగస్వామ్యులు అని పోలీసులు నిర్థారించారు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన అంజిరెడ్డికి హత్యతో సంబంధం లేకున్నా - ముందుగానే హత్యగురించి తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆ కారణంగా అతడిని అరెస్ట్ చేశారు. కమెడియన్ గా - క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించిన సూర్య ప్రసాద్ గత కొంత కాలంగా అవకాశాలు లేకుండా ఉన్నాడు.  వీరి అరెస్ట్ తర్వాత కూడా హత్య కేసులో ఇంకా సాక్ష్యులను పోలీసులు విచారిస్తూనే ఉన్నారు.