నేను లోకేష్ తండ్రినే, మీరు జశోదా భర్త అని మరిచారా?: మోడీకి చంద్ర బాబు ప్రశ్న

22:50 - February 10, 2019

*లోకేశ్ తండ్రి అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా

*ఈ వ్యాఖ్యలు చేయాల్సి రావడం బాధగా ఉంది 

*"లోకేష్ కే పితా" కమెంట్ పై ఫైర్  

 

"లోకేష్ కే పితా" ఈరోజంతా ఆంధ్రప్రదేశ్ సీయం చంద్రబాబుని ఉద్దేశించి భారత ప్రధాని వాడిన మాట. గుంటూరు పర్యటనలో చేసిన ప్రసంగం లో మోడీ చంద్రబాబు అని వాడాల్సిన చోటల్లా "లోకేష్ కీ పితా" (లోకేష్ వాళ్ళ నాన్న) అని మాత్రమే సంభోదించారు. నిజానికి ఇది తీవ్రమైన విమర్శ కాదుగానీ ఒక ప్రధాని మరొక అధికారం లో ఉన్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనటమే ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ రోజు మొత్తం సోషల్ మీడియాలోనూ మోదీ వాడిన ఈ సంబోధన మీదనే చర్చ కనిపిస్తోంది.
 
    అయితే ఈ విషయం లో చంద్రబాబు కూడా బాగానే హర్ట్ అయినట్టున్నారు. తనని ఇంతగా తీసి పడేస్తూ 'లోకేష్ కీ పితా" అని సంబోదించటం మీద ఆయన గట్టిగానే ప్రతిస్పందన తెలియజేశారు. ఒక తండ్రిగా తాను లోకేశ్ తండ్రి అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని చెప్పిన బాబు, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కుటుంబ బంధాల విలువ తెలియదన్నారు. అంతే కాదు  ముస్లిం మహిళల సంక్షేమం పేరుతో ట్రిపుల్ తలాఖ్ బిల్లు తెచ్చిన ప్రధానమంత్రి ఆయన మాత్రం తన కుటుంబం నుంచి విడిపోవడాన్ని ప్రస్తావించారు. 
తాను లోకేశ్ తండ్రి అయితే… ప్రధానమంత్రి మోడీ జశోదా బెన్ భర్త అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇలా తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడి తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని విమర్శించారు. తన కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి తాను కూడా ఈ వ్యాఖ్యలు చేయాల్సి రావడం బాధగా అనిపిస్తోందని అన్నారు.  
 తాను ఎంటీఆర్ కి వెన్నుపోటు పొడిచానని విమర్షిన మోడీ తాను తన గురువైన అద్వానికి చేసిందేమిటన్న ఆయన  ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుంటూరులో చెప్పిన లెక్కలపై కూడా సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఆనాడు లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని రాజకీయాల కోసం కాదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు.  ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే మరో 15 సీట్లు గెలిచేవాళ్లమని అన్నారు. ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని మోడీ చెబుతున్నారని ఎక్కడ ఇచ్చారు? దేనికి ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. పెత్తందారీ వ్యవస్థను టీడీపీ ఉపేక్షించదన్నారు. ఎదురు ప్రశ్నిస్తే ఐటీ ఈడీలతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.  


           తాను మోడీకి ఊడిగం చేయకపోవటం వలనే తనమీద కక్షగట్టారని, నిధులు కూడా ఇవ్వటం లేదని చెప్పిన చంద్రబాబు ఊడిగం చేయటానికి మేమేమి బానిసలం కాదు అని చెప్పారు. తనపై నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, రైతులకు ఉన్న స్ఫూర్తి ఈ ప్రధానికి లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జనం రాని బీజేపీ సభ కోసం వైసీపీ జనాలను సమీకరించాల్సి వచ్చిందని ఎగతాళి చేసిన చంద్రబాబు. పోలవరానికి ఇంకా రూ. 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని వెనుకబడిన ప్రాంతాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని తెలిపారు.

వెనుకబడిన ప్రాంతాలకు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. గతంలో తనపై మోడీకి ఉన్న నమ్మకం ఇప్పుడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇవ్వడం చేతకాక తనను విమర్శిస్తున్నారని అన్నారు. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని చంద్రబాబు మోడీని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర గడ్డపైకి వచ్చిన ప్రధాని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మోడీ ఒక ప్రచార ప్రధాన మంత్రి అని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని మన గ్యాస్ ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. 

అయితే ఇవన్నీ చెప్పిన చంద్ర బాబు నోట్ల రద్దు గురించి కూడా మాట్లాడుతూ "ఆ నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా?" అని ప్రశ్నించారు. నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. కానీ అప్పట్లో నోట్ల రద్దు గురించి తామే మోడీని ప్రోత్సహించామని చెప్ప్న విషయం మరొక్కసారి గుర్తు రాక మానదు.