మళ్ళీ రామమందిరం నిర్మిస్తారట: అమిత్ షా ప్రకటన

05:54 - January 12, 2019

2019 ఎన్నికల సందర్భంగా బీజేపీకి మళ్ళీ ఇంకోసారి రామ మందిరం అవసరం పడింది. ఈసారి ఏది ఏమైనా అయోధ్యలో  రామ మందిరం నిర్మించి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా బలంగా చెప్పారు. తాము రామ మందిరం నిర్మించటం కోసం సర్వశక్తులూ ఒడ్డి మరీ ప్రయత్నిస్తున్నామని అయితే తమ సంకల్పానికి, కాంగ్రెస్‌ పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని మండిపడ్డారు.

    వచ్చే లోక్‌సభ ఎన్నికలను భారత దేశ చరిత్రను మలుపు తిప్పిన మూడో పానిపట్‌ యుద్ధంతో పోలిచిన షా, ఈ ఎన్నికలు బీజేపీ సాంస్కృతిక జాతీయ వాదానికీ, ప్రతిపక్షాల అధికార దాహానికి మధ్యనే జరగనున్నాయని తెలిపారు.  ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. రెండురోజుల ఈ సమావేషాల్లో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ల బిల్లు, ఓబీసీ కమిషన్‌కు చట్టబద్దత, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ పరిరక్షణ, జీఎస్టీ సరళీకరణ తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు… దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థ భద్రతకు విఘాతం కలవకుండా ఉండాలంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలన్నదే నినాదం కావాలని సూచించనున్నారు. 

"అయోధ్యలో తొందరగా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలని పార్టీ పట్టుదలతో ఉండగా కాంగ్రెస్‌ అడ్డంకులు కల్పిస్తోంది. అయితే, బీజేపీ రామ మందిరాన్ని నిర్మించి తీరుతుంది" అని అన్నారు. మందిర నిర్మాణంపై కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరేంటో స్పష్టం చేయాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, అద్భుతమైన, పారదర్శక, కష్టపడి పనిచేసే నేత బీజేపీకి ఉన్నారు. 1987 నుంచి ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ప్రతిపక్షంలో ఆయనకు సరితూగగల నేత లేరు. మోదీ మాదిరిగా మరెవ్వరూ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు’ అని పేర్కొన్నారు.  

ప్రధాని మోదీని ఓడించాలనే చౌకబారు ఎత్తుగడతోనే మహా కూటమి ఏర్పడుతోందనీ, ఈ కూటమికి ఒక విధానం కానీ, నాయకుడు గానీ లేరని అమిత్‌ అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసిన మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.  ‘వచ్చే సాధారణ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటంగా సాగనున్నాయి. సాంస్కృతిక జాతీయ వాదం, పేదల అభ్యున్నతే బీజేపీ పార్టీ లక్ష్యం కాగా, ప్రతిపక్షాలు అధికారమే పరమావధిగా ఏకమవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ‘కూటమిలోని పార్టీలన్నీ 2014 ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైనవే. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ 2014 ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాలు సాధించడం ఖాయం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.