"శ్రీదేవి మాత్రమే అలా చనిపోతుందా?" : శ్రీదేవి బంగ్లా దర్శకుడు 

16:31 - January 17, 2019

బాలీవుడ్ నటి  శ్రీదేవి మ‌ర‌ణం ఒక చిక్కుముడిగానే ఉండి పోయింది. అది ప్రమాదమె అనీ, లేదూ పక్కాగా ప్లాన్  చేసిన మర్డర్ అనీ చాలా ఊహా గానాలే నడిచాయి. కానీ ఆమె మరణ రహస్యం ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ అనుమానాలకు తోడు ఇప్పుడు ఇంకో అనుమానం కూడా మొదలయ్యింది. శ్రీదేవి మరణం అనే పాయింట్ తో సినిమా తీస్తున్నారా అనిపించేలా ఒక మూవీ వ‌స్తోంది. దాని పేరు కూదా "శ్రీదేవి బంగ్లా".  ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్న భామ ఎవ‌రో కాదు..ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. అసలు టీజర్ వచ్చే వరకూ ప్రియా ఇందులో నటిస్తుందన్న సంగతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. 

ఈ సినిమా ట్ర‌యిల‌ర్ తాజాగా విడుద‌లైంది. ట్ర‌యిల‌ర్‌లో కంటెంట్‌, సినిమాలో పేరు చూసి శ్రీదేవి భ‌ర్త అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. శ్రీదేవి చ‌నిపోయిన‌ట్లే.. ఈ సినిమాలో హీరోయిన్ చ‌నిపోయిన‌ట్లు ట్ర‌యిల‌ర్లో చూపించారు. దాంతో బోనీక‌పూర్ ఈ మూవీ మేక‌ర్స్‌కి లీగ‌ల్ నోటీసులు పంపారు. శ్రీదేవి బంగ్లా అనే టైటిల్ క‌న్నా, సినిమాలోని కంటెంట్‌తోనే స‌మ‌స్య ఉంది. అందుకే బోనీక‌పూర్ ఇదైపోతున్నాడు. 
 
తాజాగా ‘శ్రీదేవి బంగ్లా’ సినిమాపై రియాక్ట్ అయ్యారు చిత్ర దర్శకులు ప్రశాంత్ మంబుల్లి, నటి ప్రియా వారియర్. ‘‘చిత్ర టైటిల్‌లో శ్రీదేవి పేరును మార్చడంతో పాటు కొన్ని సన్నివేశాలు మార్పులు చేయాలనే విధంగా బోనీకపూర్‌ మాకు నోటీసులు పంపారు. ఎవరి బయోపిక్‌ అయినా తెరకెక్కించాలంటే అనుమతులు తీసుకోవాలన్న విషయం మాకు తెలుసు. క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. సినిమాలోని సస్పెన్స్‌ గురించి ముందే చెప్పగలమా?. ఈ సినిమా గురించి ప్రశ్నిస్తున్నవారందరికీ కథ చెప్పాలంటే కుదరదు. నేను శ్రీదేవికి వీరాభిమానిని. ఆమె బాత్‌టబ్‌లో పడి చనిపోయినంత మాత్రాన ఇంకెవ్వరూ అలా చనిపోకూడదని లేదు కదా? శ్రీదేవి అనేది కామన్‌ నేమ్‌. రిలీజ్‌ కాకుండానే శ్రీదేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతోందనడం సరికాదు. విడుదలయ్యాక ఇది శ్రీదేవి బయోపిక్‌ అవునా? కాదా? అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఈ సినిమాకి ముందుగా కంగనా రనౌత్‌ని అనుకున్నాం. కానీ సౌత్‌లో మరింత రీచ్‌ ఉండాలని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను తీసుకున్నాం’’ అంటున్నాడు దర్శకుడు ప్రశాంత్. .
 
ఇక ప్రియా స్పందిస్తూ.. ‘‘శ్రేదేవి అనేది ఈ సినిమాలో నా పేరు మాత్రమే. దానికే ఇంత రాద్ధాంతం అవసరమా?. ప్రస్తుతం ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం శ్రేదేవి నేపథ్యంలో ఉందా? లేదా? అనేది విడుదలయ్యాక ప్రేక్షకులే చెప్తారు’’ అని చెప్పింది.