జయలలితగా కంగనా రనౌత్ : త్వరలో రానున్న "తలైవి"

15:23 - March 23, 2019

*త్వరలో రానున్న జయలలిత బయోపిక్ 

*జయలలితగా కనిపించనున్న కంగనా రనౌత్

*తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా విడుదల

 

 

ఇప్పట్లో మన సినిమాల్లో బయోపిక్ ట్రెండ్ వెనక్కు తగ్గేలా లేదు. వరుసగా ప్రముఖుల బయో పిక్ లు వస్తూనే ఉన్నాయి. క్రీడాకారుల, సక్సెస్ఫుల్ వ్యాపార వేత్తల జీవిత కథలతో మొదలైన ఈ బయో పిక్ ట్రెండ్ ఇప్పుడు భారతీయ సినిమాలో ఒక కొత్త జోనర్. నిజానికి మనదగ్గర సినిమాలు మణిరత్నం ఎక్కువ చేశాడని చెప్పొచ్చు.

అండర్వరల్డ్ డాన్ వరదరాజ మొదళియార్ జీవితం ఆధారంగా తీసిన "నాయకుడు", ఎంజీఆర్, కరుణానిధిల నిజజీవిత కథని తీసుకొని చేసిన"ఇద్దరు", ధీరూభాయి అంబాని జీవితం ఆధారంగా తీసిన గురు"గురు" ఇలా చాలామంది ప్రముఖుల జీవితాలని తెరకెక్కించాడు. అయితే అప్పుడు ఇంతగా ఆకట్టుకోలేదు గానీ గత పదేళ్ళుగా "బయో పిక్" అనేది జనాల్లో ఎంత పాజిటివ్ బజ్ తీసుకురాగలదో గమనించిన రాజకీయ ప్రముఖులు ఈ తరహా చిత్రాల మీద ఆసక్తి పెంచుకున్నారు. 


 ఇక వరసబెట్టి రాజకీయ, సినీ ప్రముఖుల జీవితకథలు సెల్యులాయిడ్ మీదకు రావటానికి క్యూకట్టేసాయి. నరేంద్రమోడీ జీవితాన్ని ‘పీఎం నరేంద్ర మోదీ’ అనే పేరుతో తెరకెక్కిస్తుండగా ఇప్పుడు తమిళనాట మరో ప్రయత్నం మొదలయ్యింది. తాజాగా దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ రూపొందుతుంది.

తమిళ రాజకీయాలను ఒక ఊపు ఊపిన "పురచ్చి తలైవి" ఒకనాటి పాపులర్ సినీస్టార్ కూడా అన్నవిషయం తెలిసిందే కదా. 1960 మ‌ధ్య కాలంలో టాప్ హీరోయిన్‌గా అలరించిన అందాల న‌టి జ‌య‌లలిత. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌,భాష‌ల‌లో దాదాపు 140కి పైగా సినిమాలు చేసింది పురచ్చితలైవీ.  నటిగా మొదలై ఒక రాష్ట్ర రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రిగా, దేశంలోనే ముఖ్య రాజకీయ నేతల్లో ఒకరిగా నిలిచిన జయలలిత జీవితం లో సినిమాకి సరిపడినన్ని మలుపులూ, కావాల్సినంత మెలో డ్రామా ఉంది.

భార‌త రాజ‌కీయాల‌లోను ముఖ్య భూమిక పోషించిన జ‌య‌ల‌లిత దాదాపు 14 సంవత్స‌రాల‌కి పైగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌ల‌ని నిర్వ‌ర్తించింది. త‌మిళ తంబీలు అమ్మ‌గా పిలుచుకొనే జ‌య‌ల‌లిత కొద్ది రోజుల క్రితం అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆమెపై బ‌యోపిక్ రూపొందించేందుకు ప‌లువురు ద‌ర్శ‌కులు స‌న్నాహాలు చేస్తున్నారు.  

ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. శనివారం కంగన పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ప్రకటించింది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా విడుదల చేయనున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ సింగ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.