ఆ రెండు ప్రమాదాల వల్ల భారీ నష్టం...

12:38 - March 18, 2019

రూ.41 లక్షల కోట్లు. ఇంత భారీ మొత్తాన్ని ఒక్కసారిగా పేపర్ మీద అంకెల రూపంలో రాయలేని పరిస్థితి. మరి ఇంత భారీ నష్టం ఒక కంపెనీకి వాటిల్లిందంటే...సదరు కంపెనీ పరిస్థితి ఏమిటి?. సరిగ్గా విమానాల తయారీలో తోపులాంటి బోయింగ్‌ కంపెనీకి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. వివరాల్లోకి వెలితే...ఇండోనేషియానకు చెందిన లయన్ ఎయిర్ విమానం.. ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన రెండు విమానాలు ఒకటి తర్వాత ఒకటి ప్రమాదానికి గురి కావటం.. పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ఈ రెండు ప్రమాదాలు బోయింగ్ కంపెనీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎందుకంటే..ఈ రెండు ప్రమాదాలకు కారణమైన విమానాలు సదరు కంపెనీవే. అయితే ప్రమాదం జరిగితే ఇంత నష్టం ఎలా అవుతుంది అనుకుంటున్నారా...ఆ వివరాల్లోకి వస్తే... ఈ రెండు ప్రమాదాల వేళ.. వినియోగించిన విమానాలు బోయింగ్ కు చెందిన 737 మాక్స్ మోడల్ కు చెందినవి కావటంతో ఈ విమానాల కోసం భారీఎత్తున ఆర్డర్ ఇచ్చిన వారు తమ ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకోవటానికే మక్కువ చూపుతున్నారు. ఈ మోడల్ విమానాల కోసం బోయింగ్ వద్ద ఇప్పటివరకూ రూ.41లక్షల కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. ఇంత భారీ మొత్తంలో ఉన్న ఆర్డర్లలో చాలావరకూ క్యాన్సిల్ కావటమో.. పునరాలోచనలో పడటమో చేస్తుండటంతో బోయింగ్ కు దిమ్మ తిరిగిపోతోంది. అందుకే అంటారు..  భారీ ఎత్తున వ్యాపారాన్ని నిర్మించటం ఒక ఎత్తు. దాన్ని నిలుపుకోవటం మరో ఎత్తు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వ్యాపారాన్ని నిర్వహించే సంస్థ పునాదులు ఒకట్రెండు ఘటనలతో లేచిపోతుంటాయి. తాజాగా చోటు చేసుకున్న  రెండు ఉదంతాలు దీనికి నిదర్శనంగా చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఈ సంస్థకు ఆర్డర్లు ఇచ్చిన విమానయాన సంస్థల్లో ఇండోనేషియాకు చెందిన లయన్.. రష్యాకు చెందిన మరో సంస్థ.. సౌదీ అరేబియాకు చెందిన మరో సంస్థకు చెందిన ఆర్డర్లు రద్దు అయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో.. ఈ విమానంలోని సాంకేతిక లోపాల్ని యుద్ధ ప్రాతిపదికన సరిదిద్దేందుకు బోయింగ్ నడుం బిగించింది.  పది రోజుల్లో 737 మాక్స్ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేయాలని నిర్ణయించింది. మరికొన్ని వారాల్లో అప్ గ్రేడ్ చేసే సాఫ్ట్ వేర్ తో బోయింగ్ 737 మాక్స్ లు ఎగురుతాయని సదరు సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. బోయింగ్ విమానాల్లో అమర్చిన యాంగిల్ ఆఫ్ అటాక్ సెన్సర్ నుంచి వచ్చే సందేశాలు కచ్ఛితంగా విశ్లేషించేలా మార్పులు చేయనున్నారు. ప్రమాదానికి గురైన లయన్ విమానంలోనూ ఈ సెన్సర్ల వద్ద నెలకొన్న గందరగోళంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న రెండు వరుస ప్రమాదాలతో బోయింగ్ మాక్స్ 737 డిమాండ్ తగ్గిపోగా.. పదేళ్ల పాతవైన 737 ఎన్ జీ విమానాలకు డిమాండ్ పెరిగిపోయింది. పది శాతం ఎక్కువ అద్దె చెల్లించేందుకు విమానయాన సంస్థలు ఓకే చెప్పటం విశేషం.