బీజేపీ సమావేశాలను బహిస్కరించిన మీడియా...

14:48 - January 4, 2019

గత రెండు రోజులుగా కేరళ అట్టుడికిపోతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి  మహిళల ప్రవేశంతో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారలేదు. మహిళల గర్భగుడి ప్రవేశానికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం నుంచే కేరళలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గురువారం నాటి బంద్‌తో అది హింసాత్మకమైంది. బంద్ పేరుతో ఆందోళనకారులు దుకాణాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రోడ్లపై హంగామా చేశారు. అక్కడితో ఆగక జర్నలిస్టులపై దాడికి దిగారు. బంద్‌ను కవర్ చేసేందుకు వచ్చిన పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులపై అల్లరిమూక దాడులకు పాల్పడింది. మహిళా రిపోర్టర్లను కూడా వదలకుండా యథేచ్ఛగా దాడులకు దిగారు. బంద్‌లో తమపై జరిగిన దాడికి జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు. తిరువనంతపురం, కోజికోడ్‌లలో బీజేపీ నేతలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై తిరువనంతపురంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కె.సుందరన్ కోజికోడ్‌లో నిర్వహించిన మీడియా సమావేశాలను మీడియా బాయ్‌కాట్ చేసింది. గత రెండు రోజులుగా వందలాదిమంది జర్నలిస్టులపై సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేయూడబ్ల్యూజే) ఆవేదన వ్యక్తం చేసింది.  ఇకపై సహించేది లేదని తేల్చి చెప్పింది. అందుకనే బీజేపీ మీడియా సమావేశాలను బహిష్కరించినట్టు వివరించింది.