దృశ్యం సినిమా చూసి మరీ మర్డర్ ప్లాన్ : ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన హంతకులు

16:12 - January 13, 2019
కొన్ని సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయంటే నమ్మలేమేమో గానీ అచ్చంగా అలంటి సంఘటనలే బయటకూడా జరిగినప్పుడు మాత్రం కాస్త భయంగానే ఉంటుంది. ఇండోర్ లో జరిగిన ఒక ఉదంతంలో హంతకులు బాలీవుడ్ లో వచ్చిన అజయ్ దేవ్ గన్ "దృశ్యం" సినిమా చూసి మరీ సాక్ష్యాలు లేకుండా ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకున్నారు. (తెలుగులో వెంకటెష్ హీరోగా కూడా వచ్చిందీ సినిమా) ఒక అమ్మాయిని హత్య చేసి మరీ రెండేళ్ళ పాటు అటుపోలీసులకూ ఇటు జనానికీ ఏమాత్రం అనుమానం రాకుండా తప్పించుకున్నారు. అయితే ఈ హత్య కేసులో దొరక్కుండా ఉండా వీళ్ళు చేసిన మాస్టర్ ప్లాన్ మాత్ర పోలీసులనే ఆశ్చర్యపరిచింది. ఎట్టకేలకు మిస్టరీని చేదించి ఈ ఇద్దరినీ పట్టుకున్నా వాళ్ళ అతితెలివికి మాత్రం ముక్కున వేలేసుకున్నారు పోలీసులు...  
 
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఇండోర్ కు చెందిన బీజేపీ మాజీ కౌన్సిలర్ జగదీశ్ కరోటియా (65) అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ మహిళా కార్యకర్త ట్వింకిల్ దాగ్రే (22) ల మధ్య వివాహేతర బంధం ఏర్పడింది. వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధం కరోటియా ముగ్గురు కుమారులు అజయ్‌(38), విజయ్‌(36), వినయ్‌(31)లకు తెలిసింది. దీంతో తండ్రితో గొడవకు దిగారు. ట్వింకిల్ తో గడిపితే సహించేది లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పటికే ట్వింకిల్ తో చాలా దూరం వెళ్ళిన జగదీష్ ఆమెను వదిలించుకునేందుకు కుమారుల ఒత్తిడితో ట్వింకిల్ ను హతమార్చేందుకు ప్లాన్‌ చేశాడు. ఆపై  తమ సన్నిహితుడు నిలేశ్‌(28)తో కలిసి ట్వింకిల్ ను హత్య చేశారు.

హత్య అనంతరం ఆమెను తమ కారులో తీసుకెళ్లి కాల్చేశారు. ఈ హత్యపై కచ్చితంగా పోలీసులు తమనే అనుమానిస్తారని ఊహించిన నిందితులు. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా ఓ చోట చనిపోయిన కుక్క మృత దేహాన్ని పాతిపెట్టారు. కొంతకాలం తరువాత ఎవరినో హత్య చేసి, పూడ్చి పెట్టారన్న పుకారును లేవనెత్తారు. అప్పటికే ట్వింకిల్ అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్ తో రాగా, పూడ్చి పెట్టిన ప్రాంతంలో కుక్క కళేబరం మాత్రమే వారికి కనిపించింది. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి.
అయితే ట్వింకిల్ అదృస్శ్యం కేసులో జగదీష్ కీ ట్వింకిల్ కీ ఉన్న అక్రమసంభందాన్ని తెలుసుకున్న పోలీసులు కాస్త గట్టిగా ప్రయత్నించటంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.  నిందితులను అరెస్ట్‌ చేశామని, మరిన్ని వివరాల కోసం వారిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.