మోడీ బొట్టుబిళ్ళలు: బేజేపీ కొత్తతరహా ప్రచారమా?

14:02 - April 1, 2019

*మోడీ "మార్కు" బిందీ ప్రచారం

*బిందీ ప్యాక్ మీద ప్రధాని బొమ్మ తో కొత్త ప్రచారం

 *పరాస్ ఫ్యాన్సీ బిందీ ప్యాక్ లపై మోదీ, కమలం బొమ్మలు 

 

మోడీ "మార్కు" ప్రచారం వింతపోకడలతో నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ఫోటోలను ముద్రించిన రైల్వే టికెట్లపై దుమారం రేగింది. దీంతో రైల్వే వాటిని ఉపసంహరించుకుంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో బీజేపీ ఎన్నికల నినాదమైన ‘మై బీ చౌకీదార్’ కప్పుల్లో ప్రయాణికులకు చాయ్ ఇవ్వడం కూడా వివాదానికి కారణమైంది.

ఓ ప్రయాణికుడు ఆ కప్పు ఫొటోను ట్వీట్ చేస్తూ.. ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేశాడు. ఇది ఎన్నికల నిబంధన ఉల్లంఘనలోకి రాదా? అని ప్రశ్నించాడు. దీంతో రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. అయితే ఈసారి మాత్రం కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టున్నారు. బిందీ ప్యాక్ మీద ప్రధాని బొమ్మ తో కొత్త ప్రచారం మొదలయ్యింది.

                                                                   

2014లో మోదీ అధికారంలోకి రావడానికి ‘చౌకీదార్’ (కాపలాదారుడు) అనే నినాదం బాగా ఉపయోగపడింది. ‘చాయ్ వాలా’ నినాదం తర్వాత నరేంద్రమోదీని హైలైట్‌గా నిలబెట్టింది ‘చౌకీదార్’ నినాదామే. అయితే కొంత కాలంగా చాయ్ వాలా నినాదాన్ని పక్కన పెట్టారు మోదీ. ప్రతి సభలో తనను తాను చౌకీదార్‌గా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రయత్నాలే కాదు మారుమూల పల్లెల్లోకి కూడా బీజేపీ చేరుకోవటానికి మరోరకంగా ఆలోచించారేమో గానీ కొత్త తరహా ప్రచారం చేస్తోంది బీజేపీ. 

                                                                  

  ఈ ఆలోచన బీజేపీ వాళ్ళదేనా లేక ఆ బిందీ కంపెనీదా తెలియదు కానీ పరాస్ ఫ్యాన్సీ బిందీ అనే సంస్థ ఈ బొట్టు బిళ్లల ప్యాకెట్లను విడుదల చేసింది. మళ్లీ మోదీయే అధికారంలోకి రావాలనే నినాదంతో ఒక వైపు ప్రధాని మోదీ ఫొటోను, మరోవైపు బీజేపీ గుర్తును ముద్రించింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ నియోజకవర్గం ఎంపీ సలీం ట్విట్ చేశారు. నోట్ల రద్దు సమయంలో పేటీఎం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మోదీ ఇప్పుడు పరాస్ ఫ్యాన్సీ బిందీలకు ముఖ చిత్రంగా మారిపోయారంటూ ఎద్దేవా చేశారు.