భారత్‌లో నీరు తాగుతున్నారా...అయితే ఇది చదవాల్సిందే...

13:10 - February 20, 2019

ప్రస్తుతం భారత్‌లో దొరికే నీరు సురక్షితం కాదా?...ఈ నీరు తాగితే రోగాలు బారిన పడటం ఖాయమా? అంటే అవుననే అంటున్నారు అమెరికాలోని గ్రేటర్‌ షికాగో మెట్రోపాలిటన్‌ వాటర్‌ రీక్లేమేషన్‌ కమిషనర్‌ ఫ్రాంక్‌ ఆవిల. వీటిపై తక్షణం దృష్టి సారించకుంటే పదేళ్లలో భారత్‌లో స్వచ్ఛమైన నీరే దొరకదు. అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అని ఫ్రాంక్‌ ఆవిల అన్నారు. తెలంగాణాతోపాటు ఇతర రాష్ట్రాలు నీటి కాలుష్యంలో అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఈ నీటిని కొన్ని వారాలపాటు తాగినా.. దీర్ఘకాలిక రోగాల బారిన పడతారని పేర్కొన్నారు. భారత్‌లో ఇలాంటి ఘోర పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందన్నారు. ప్రస్తుతం భారత్‌ లాంటి పరిస్థితి 70 సంవత్సరాల క్రితం షికాగోలోనూ ఉండేదని, ఈ సమస్యలను అధిగమించేందుకు తమకు 50 ఏళ్లు పట్టిందన్నారు. పదేళ్లలో భారత్‌లో ఐఫోన్‌ అందరికీ అందుబాటులోకి వచ్చినా.. స్వచ్ఛమైన తాగునీరు మాత్రం లభించదన్నారు. తెలంగాణాతో పాటు భారత్‌లోని మొత్తం నీటి వనరుల్లో 70 శాతం అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా), ఎన్‌ఐఆర్డీ పీఆర్‌ సంయుక్త ఆధ్వర్యంలో ' నీరు, వ్యర్థాల నిర్వహణ'  అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు మంగళవారం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. సదస్సుకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఫ్రాంక్‌ ఆవిల మాట్లాడుతూ.. అమెరికాలోని ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉందని, నీటి వనరుల కలుషితం పెద్ద నేరంగా పరిగణిస్తారని అన్నారు. ప్రతి గ్రామంలో వాటర్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు తప్పనిసరి కావడంతో వందశాతం నీటి పునర్వినియోగం జరుగుతుందన్నారు. నీటి పునర్వినియోగానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరితే పూర్తి సాంకేతిక సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.