రెండో రోజు కొనసాగుతున్న భారత్‌ బంద్‌...హెల్మెట్‌లతో బస్సు డ్రైవర్లు

16:01 - January 9, 2019

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు రెండు రోజుల భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభమైన దేశవ్యాప్త సమ్మె రెండో రోజు బుధవారం కూడా కొనసాగుతోంది. కోల్‌కతాలో కార్మికులకు మద్దతుగా సీపీఎం కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హౌరాలో ఓ పాఠశాల బస్సుపై నిరసనకారులు దాడి చేసిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. జాదవ్‌పూర్‌లో పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. కార్మికుల ఆందోళనల దృష్ట్యా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించాలని పశ్చిమ్‌ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వామపక్షాలు బలంగా కేరళ, పశ్చిమ్‌ బెంగాల్‌తోపాటు ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. బంద్‌ నేపథ్యంలో కేరళలో 4,500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.