బాలయ్య చేసిన ప్రతి కామెంట్‌కీ...కౌంటర్‌ కామెంట్‌ : నాగబాబు

12:59 - January 7, 2019

గత కొన్ని రోజులుగా బాలకృష్ణపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తూ వస్తున్న మెగా బ్రదర్ నాగబాబు హాట్ టాపిక్ అయిన విషయం తెల్సిందే. సోషల్ మీడియాతో పాటు పలు వేదికలపై నాగబాబుపై నందమూరి ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. తనపై తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాగబాబు నేరుగా బాలయ్యపై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసిన నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలను విడుదల చేస్తూ వస్తున్నాడు. ఆ వీడియోల్లో అసలు బాలయ్యపై ఎందుకు కామెంట్‌ చేయాల్సి వస్తుందో వివరణ ఇస్తున్నాడు నాగబాబు. గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నాడు - దానికి కామెంట్ నెం.1 అంటూ నాగబాబు ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత బాలకృష్ణ చేసిన ‘ఒకరిని హీరోను చేయడం మాకు ఇష్టం లేదు - మేమే సూపర్ స్టార్స్....’ అన్న వ్యాఖ్యలకు కామెంట్ నెం.2 అంటూ వీడియోను విడుదల చేశాడు. ఇక మూడవ వీడియోలో బాలకృష్ణ చేసిన... అమితాబ్ ఏం పీకాడు - చిరంజీవి ఏమైంది - మేము వేరు - మా బ్లడ్ వేరు - మా బ్రీడ్ వేరు వ్యాఖ్యలకు కామెంట్ నెం.3 అంటూ వీడియో విడుదల చేశాడు ఈ మూడు వీడియోల్లో కూడా బాలకృష్ణ చేసిన ఒక్కో వ్యాఖ్యపై సుదీర్ఘంగా మాట్లాడాడు. అమితాబ్ వంటి వారిని ఏం పీకారు అంటూ ప్రశ్నించావు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ స్థాయిలో అమితాబచ్చన్ - ఎంజీఆర్ - ఏయన్నార్ లు నిలిచారు. వారికి గౌరవం ఇవ్వాలి. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి పేరు ఎత్తాల్సిన అవసరం ఏంటీ అంటూ నాగబాబు ప్రశ్నించాడు. ఇండస్ట్రీలో మీరు మాత్రమే సూపర్ స్టార్స్ కాదు - ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. బ్లడ్ - బ్రీడ్ అంటూ బాలయ్య కామెంట్స్ కు నాగబాబు స్పందిస్తూ.. అలాంటి విషయాలు మనుషులు మాట్లాడుతారా - ఆస్ట్రియా - ఇంగ్లాండ్ ల్లో రాజవంశస్తులు బ్లడ్ - బ్రీడ్ అంటూ మాట్లాడితే అక్కడి జనాలు తొక్కి పారేశారు. మీరు ఏది పడితే అది మాట్లాడితే అన్నయ్య చిరంజీవి - తమ్ముడు పవన్ కళ్యాణ్ లు పట్టించుకోరు - వరుణ్ - చరణ్ వంటి వారు ఇలాంటి వాటి జోలికి వెళ్లరు. మీరు ఏది మాట్లాడినా చెల్లి పోతుందనుకుంటే మాత్రం మీ పొరపాటే అంటూ నాగబాబు ఘాటుగా స్పందించాడు. బాలకృష్ణ ఆరు కామెంట్స్ పై నాగబాబు స్పందించనున్నాడు. అంటే మరో మూడు వీడియోలు కూడా విడుదల కాబోతున్నాయన్నమాట. ఇప్పటికే వివాదం ముదిరింది - ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.