మళ్ళీ మూతపడనున్న బ్యాంకులు: 2019లో సమ్మె తేదీలివే

03:30 - January 6, 2019

      నెలకూడా తిరగకుండానే బ్యాంకులు మళ్ళీ సమ్మె బాట పట్టాయి. వేతన సవరణ, పెన్షన్‌తో పాటు ఇతర సమస్యల పరిష్కారానికై అఖిల భారత బ్యాంక్‌ అధికారుల సంఘం (ఏఐబీఓసీ) ఇచ్చిన పిలుపు మేరకు 2018 డిసెంబరు 21న బ్యాంకుల అధికారులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. తిరిగి రెండవసారి డిసెంబరు 26న దేశ వ్యాప్తంగా 9 బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆసమయంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది సమ్మె చేపట్టారు. రెండు వారాల వ్యవధిలోనే మళ్ళీ బ్యాంకు ఉద్యోగులు మూడోసారి సమ్మెకు దిగుతున్నారు.


 ఈ నెల (2019 జవరి) 8, 9 తేదీల్లో బ్యాంకులు మరోమారు మూతపడనున్నాయి. ఉద్యోగ విధానాలపై కేంద్రం తీరును నిరసిస్తూ పది ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్ఐ)లు ఈ నెల 8, 9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని, ఆ సమాచారాన్ని భారత బ్యాంకుల సంఘానికి (ఐబీఏ) అందించినట్టు ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొన్నాయి.  

ఈ రెండు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన సమాచారాన్ని  బీఎస్‌ఈ ఫైలింగ్‌ సందర్భంగా ఐడీబీఐ బ్యాంక్‌ పేర్కొంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ఈ నెల 8, 9 తేదీల్లో బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన వేలాది మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. దీంతో ఆ రెండు రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది.