వాళ్ళకి ఉధ్యోగాలూ, వైధ్యం కూడా ఆపేయాలి: రాందేవ్ బాబా

13:59 - January 24, 2019

కోట్ల జనాభా ఉన్న దేశంలో జనాభా నియంత్రణ అన్నింటికంటే ముఖ్యమైన విషయమని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. ఓవైపు దేశంలోని ఆర్ ఎస్ ఎస్ లాంటి సంస్థలు దేశంలో హిందువులు జనాభా తగ్గిపోతుందని హిందువులు ఎక్కువ మంది సంతానాన్ని కనాలని ప్రోత్సాహిస్తుంటే దీనికి విరుద్ధంగా రాందేవ్ బాబా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే వారి ఓటు హక్కును తొలగించాలని చెబుతున్నారు.

అంతేనా ప్రభుత్వ ఉద్యోగాలు వైద్య సదుపాయాలు వంటిని తొలగిస్తే జనాభా నియంత్రణ సాధ్యపడుతుందని అంటున్నారు. "దేశంలో జనాభాను నియంత్రించాలంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనేవారికి ఓటు హక్కుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు వంటివి తొలగించాలి. హిందువైన, ముస్లిం అయిన ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే ఇవే చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడే జనాభా నియంత్రణ సాధ్యపడుతుంది" అంటూ తనదైన పద్దతిలో పరిష్కారం చెప్పేసారు. ఈ విషయంలో హిందూ ముస్లింలనే బేధాలు లేకుండా ఎవరైనా సరే ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా రాందేవ్ బాబా వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆయనకు మద్దతు ప్రకటిస్తూ మోజార్టీ ప్రజలు మాత్రం ఈ వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు చైనా దేశం జనాభా నియంత్రణ కఠినం చేయడంతో ఆ దేశంలో ప్రస్తుతం యువత సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దేశం అభివృద్ధి చెందాలంటే జనాభా అవసరమని గ్రహించిన చైనా తాజాగా ఒకరు ముద్దు.. అసలే వద్దు.. అనే నినాదాన్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

రాందేవ్ బాబా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలను కంటే.. వారికి స్కూల్ అడ్మిషన్స్, వైద్య సదుపాయాలు కల్పించవద్దని అప్పట్లో అన్నారు. అంతేకాదు, పెళ్లి చేసుకున్నవారి కంటే తనలాంటి బ్రహ్మచారులకు సమాజంలో ఎక్కువ గుర్తింపు, మర్యాదలు లభించాలన్నారు. ప్రస్తుతం చైనా కూడా జనాభా నియంత్రణపై వెనక్కి తగ్గింది. మరి బాబా గారి మాటలతో ఏకీభవించి ఇదే పద్దతి పాటిస్తే ఏం జరుగుతుందో తెలిసిందే కదా. వయస్సు మళ్ళినవాళ్ళు ఎక్కువై యువత తగ్గిపోయి గందరగోళం ఏర్పడ్డాకే కదా చైనా కూడా కాస్త తగ్గింది.