భారత జట్టుపై ప్రసంసలు కురిపించిన పాక్‌ క్రికెటర్స్‌

16:38 - January 9, 2019

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్‌ క్రికెట్‌ జట్టును పాక్‌ క్రికెట్‌ దిగ్గజాలు, మాజీ ఆటగాళ్లు ప్రసంసించారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సైతం టీమిండియాని అభినందించిన విషియం తెలిసిందే. ఆస్ట్రేలియాలో సిరీస్‌ కైవసం చేసుకున్న తొలి ఆసియా జట్టుగా అవతరించిన భారత్‌ క్రికెట్‌ జట్టు, కొహ్లికి అభినందనలు అని ఆయన అన్నారు. నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఆసిస్‌లో సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియాను ఒకప్పటి బౌలింగ్‌ దిగ్గజం వసీమ్‌ అక్రమ్‌ అభినందించాడు. భారత్‌లోని పటిష్ఠ దేశవాళీ విధానం వల్లే ఈ విజయం సాధ్యమైందని అనుకుంటున్నా అని వసీమ్‌ అక్రమ్‌ అన్నారు. ఇదిలా వుంటే...ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం అంటే చాలా కష్టమని పాక్‌ మాజీ సారథి మొయిన్‌ ఖాన్‌ అన్నారు. బౌలర్లు, బ్యాట్స్‌మెన్స్‌ రాణించడంలో ఈ విజయం సాధ్యమైందని ఆయన అన్నారు. ఈ సిరీస్‌లో పుజారా, కొహ్లీ, పంత్‌, మిగతావారి బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. బౌలర్లు ఒత్తిడి పడకుండా బంతులు వేసేందుకు వారు బాటలు వేశారని మొయిన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.