మీ ఫోన్లలో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి: హైదరాబాద్ పోలీస్ కమిషనర్

13:37 - January 13, 2019

స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన సరీరంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. శరీరంలో ఏదైనా అవయవం పనిచేయకుంటే ఎలా ఉంటుందో ఫోన్ కాసేపు లేకపోయినా, లేదా దానికి నెట్ రాకపోయినా అంతే బాధపడే స్థాయికి వచ్చేసారు జనం. ఇప్పుడు ఫోన్ అంటే ఒకరకంగా మన మెదడుకు తగిలించుకున్న ఎక్స్ట్రా మెమొరీ చిప్ లాంటిది. కొన్ని వందల ఫొటోలు, కాంటాక్ట్స్, బిజినెస్ వ్యవహారాలూ ఙ్ఞాపకాలూ ఇలా ఎన్నో దాచి ఉంచే ఒక అర.. అలాంటి ఫోన్ దొంగిలించబడితే  కొంత డాటా మన మెమొరీనుంచే డిలీట్ చెయబడ్డట్టే.

ఒక ఫోన్ పోగొట్టుకున్నప్పుడు దాని ధరకంటే దానిలో దాచుకున్న విశయాల మీదనే మన బెంగ అధికంగా ఉంటుందన్నది మనలో చాలామందికి అనుభవమే. అయితే ఇక నుంచీ ఆ బెడద తగ్గే అవకాశం ఉంది. ఒక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే చాలు మీ ఫోన్ ని ఈజీగా ట్రాక్ చేయవచ్చు. మళ్ళీ ఆఫోన్ ని పొందొచ్చు. ఈ మాట చెబుతోంది ఏ ప్రైవేట్ యాప్ కంపెనీనో కాదు సాక్షాత్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. మీ స్మార్ట్ ఫోన్ లో "హాక్ ఐ అప్లికేషన్" సేవ్ చేసుకొమ్మని, దానివల్ల మీ పోగొట్టుకున్న ఫోన్ ని త్వరగా ట్రాక్ చేసి పట్టుకోవచ్చనీ చెబుతున్నారు. 

ఇంతకీ ఏమిటీ అప్లికేషన్? అదెలా పని చేస్తుందీ అంటే...  హాక్ ఐ మొబైల్ అప్లికేషన్‌లో వివిధ రకాలైన ఫీచర్లు ఉన్నాయి. అందులో సెకెండ్ హ్యాండ్ సెల్‌ఫోన్ కొనుగోలు చేసేవారు, సెల్‌ఫోన్ కొనేముందు హాక్ ఐ అప్లికేషన్‌లో ఐఎంఈఐ నెంబర్లను చూసుకోవచ్చు. దొంగతనం అయినా, మిస్సింగ్ అయిన సెల్‌ఫోన్లకు సంబంధించి ఐఎంఈఐ నంబర్లతో కూడిన డేటాబేస్ ఉంటుంది.దీంతో కొనబోతున్నది దొంగిలించిందా? కాదా? అనే విషయం నిర్ధారణ అవుతుంది.

కమిషనరేట్ కార్యాలయంలోని ఐటీ కోర్ టీం, హాక్‌ఐకి వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్ల ఫిర్యాదులపై స్పందించిన ఐటీ విభాగం ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా 24 సెల్‌ఫోన్లను రికవరీ చేసిందన్నారు. సుమారు 9 లక్షల మంది సెల్‌ఫోన్లలో హాక్ ఐ అప్లికేషన్ ఉందని, ప్రతి ఒక్కరూ దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయట. ఈ మధ్య పోలీస్ మొబైల్ అప్లికేషన్ హాక్ ఐకి వచ్చిన సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులపై దర్యాప్తు చేసి 24 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కమిషనర్ హాక్ ఐ కి సంబందించిన సమాచారాన్ని వెల్లడించారు.