ఉరవకొండలో యాంటీ సెంటిమెంట్‌: అక్కడ గెలిస్తే...అధికారంలోకి రారట!

14:59 - March 25, 2019

ఎక్కడైనా ఎన్నికల్లో గెలిస్తే అధికారంలోకి వస్తారు ఇది జగమెరిగిన సత్యం. కానీ ఉరవకొండలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోందట!. అరే అదేంటి అలా ఎలా అవుతుందీ అనుకుంటున్నారా?. అయితే అసలు విషియంలోకి వెళ్దాం. కొన్ని నియోజకవర్గాలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ రాష్ట్ర స్థాయిలో అధికారాన్ని చేపడుతూ ఉంటుంది. మరి కొన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీ ఓటమి పాలవుతూ ఉంటుంది. అలాంటి సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం అనంతపురం జిల్లా ఉరవకొండ. ఈ నియోజకవర్గంలో చాలా కాలంగా ఏ పార్టీ నెగ్గితే ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఓడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినదానికి నిదర్శనంగా గత ఎన్నికలను తీసుకున్నట్లయితే... గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అయితే ఉరవకొండలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తంగా రాష్ట్రంలో అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయింది. కేవలం గత ఎన్నికలనే కాదు.  అంతకు ముందు కూడా అదే కథ. అంతకు ముందు ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా నెగ్గారు. అప్పుడు రాష్ట్రంలో వైఎస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. అంతకు ముందు కూడా ఈ నియోజకవర్గం నుంచి కేశవ్ విజయం సాధించడం.. వైఎస్సార్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఉరవకొండ నియోజకవర్గం విషయంలో ఈ యాంటీ సెంటిమెంటు కొనసాగుతూ ఉంది. ఇక్కడ గెలిచిన పార్టీ ఏదీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేఫథ్యంలో ఈ సారి మరోసారి పయ్యావుల కేశవ్ వర్సెస్ విశ్వేశ్వరరెడ్డిల మధ్యన ఇక్కడ పోరు కొనసాగుతూ ఉంది. ఈ సారి ఏం జరుగుతుందో - సెంటిమెంట్ ఏమవుతుందో... వేచి చూడాల్సిందేనట!