ఎప్పటినుంచో మాట్లాడుతున్నాను, రీపోలింగ్ కావాలి : చంద్రబాబు

12:53 - April 11, 2019

ఆంధ్రప్రదేశ్‌లో రెండో ప్రభుత్వాన్ని ఎన్నుకోడానికి ప్రజలు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు మూడు కోట్ల తొంభై మూడు లక్షల పైచిలుకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వెయ్యటానికి ఈ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

ఈవీఎంల దుర్వినియోగంపై తాను ఎప్పటినుంచో మాట్లాడుతున్నానని, ఇప్పటికైనా ఈసీ అర్థం చేసుకోవాలని అన్నారు. ఈవీఎంలతో జరిగే నష్టాన్ని గుర్తించాలని కోరారు. బ్యాలెట్ అయితే ఏ సమస్యా ఉండదన్నారు. ఈవీఎంల వాడకంపై రివిజన్ పిటిషన్ వేయాలన్న ఆలోచనలో ఉన్నామని చంద్రబాబు తెలిపారు 

                                          

                                                      
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను తాము అంగీకరించబోమని, రాష్ట్రంలోని 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని, ఇప్పటికే మూడు గంటల సమయం వృథా అయిన కారణంగా ఈవీఎంలు పనిచేయని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషన్ ను ఉద్దేశించి ఆయన లేఖను రాశారు.

ఈవీఎంల పనితీరుపై రాష్ట్రమంతటి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే  అది వైసీపీకి వెళుతున్నట్టు తెలుస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అన్ని పోలింగ్ బూత్ లలో ఓటర్లు మొత్తం వచ్చి ఓటేసేంత సమయం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  

                                        

ఓటర్లు ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ స్పందించడం లేదని అన్నారు.  ఈవీఎంలతో జరిగే నష్టం ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ కు తెలిసి వచ్చి ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎన్నికలు ప్రారంభం కాగా, పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.

ముఖ్యంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ఓటేసేందుకు వెళ్లిన కేంద్రంలోనే మెషీన్ పనిచేయకపోవడంపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారం దౌర్జన్యాలకు దిగుతుంటే, ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు పోలీసులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.