అనీల్‌ అంబానీకి మరో షాక్‌...

11:28 - January 8, 2019

అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఆర్ కామ్) చైర్మన్ అనిల్ ధీరూభాయ్ అంబానీకి మరోషాక్ తగిలింది. సుప్రీంకోర్టు సోమవారం కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది. ఆర్ కామ్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో సంస్థ ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియోకు అనిల్ అమ్ముకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్తులను విక్రయించుకుంటున్నా.. తమకు ఇవ్వాల్సిన రూ.550 కోట్ల బకాయిలను మాత్రం తీర్చడం లేదని ఎరిక్సన్ ఆరోపిస్తూ సుప్రీంను ఆశ్రయించింది. ఎరిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్ విచారణలో భాగంగా అనిల్ అంబానీతోపాటు మరికొందరికీ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. వివరాల్లోకి వెలితే....దేశవ్యాప్తంగా ఆర్ కామ్ టెలికం నెట్ వర్క్ నిర్వహణ కోసం 2014లో ఎరిక్సన్ ఇండియా ఏడేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే - 2018 ఆగస్టు 3 నాటి ఆదేశాలను బేఖాతరు చేసిన నేపథ్యంలో అక్టోబర్ 23న డిసెంబర్ 15లోగా మొత్తం బకాయిలను చెల్లించాలని ఆర్కామ్ను సుప్రీం ఆదేశించింది. ఇదే చివరి అవకాశంగా పేర్కొన్న సుప్రీం.. గడువులోగా చెల్లించని పక్షంలో 12 శాతం వార్షిక వడ్డీరేటు పడుతుందని కూడా హెచ్చరించింది. అలాగే ఆర్ కామ్ విఫలమైతే ఈ వ్యవహారంపై ధిక్కార పిటీషన్ ను ఎరిక్సన్ దాఖలు చేసుకోవచ్చనీ స్పష్టం చేసింది.