బెట్టింగ్‌ రాయుళ్ల పందాలు: ఆ ఐదు అసెంబ్లీ స్థానాలపై కోట్లల్లో ....

12:51 - March 26, 2019

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్న వేళ...బెట్టింగ్‌ రాయుళ్ల పందాలు కోట్లల్లో నడుస్తున్నాయి. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇక్కడ పందాలు కాశారు. మా నాయకుడు గెలుస్తాడంటే..మా నాయకుడు గెలుస్తాడని పందాలు ఊపుమీదున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఐదు అసెంబ్లీ స్థానాలపై పందాలు కోట్లల్లోనే కాస్తున్నారట. వివరాల్లోకి వెలితే...జనంలో ఉన్న ఆసక్తికి కొందరు అప్పనంగా ‘క్యాష్’ చేసుకుంటున్నారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో జరుగా బెట్టింగ్ లు కాశారు. ముఖ్యంగా తూర్పు - పశ్చిమ గోదావరి.. రాజధాని అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లో తెలంగాణలోని టఫ్ ఫైట్ స్థానాల్లో బెట్టింగ్ లు కాశారు. అప్పుడు కోట్లు పోగొట్టుకున్న వారు కొందరైతే.. ఫలితాలు ఆశించినట్టు రావడంతో కోట్లకు పడగలెత్తిన వారు మరికొందరు.. ఇప్పుడు కూడా బెట్టింగ్ టైం వచ్చేసింది. ఏపీలో బెట్టింగ్ రాయుళ్లు పందాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా హోరాహోరీతోపాటు ప్రముఖులు పోటీచేసే స్థానాల్లో ఎవరు గెలుస్తారు? వారి మెజార్టీపై బెట్టింగ్ లు కాస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బరిలో ఈసారి పవన్ పోటీచేస్తున్న భీమవరం - కొడాలి నాని (వైసీపీ) - దేవినేని అవినాష్ (టీడీపీ) లు పోటీపడుతున్న గుడివాడ - నారా లోకేష్ బరిలోకి దిగిన మంగళగిరి - ఇక గంటా వదిలేసిన అవంతి శ్రీనివాస్ (వైసీపీ) బరిలోకి దిగిన భీమిలి - గంటా శ్రీనివాస్ (టీడీపీ) బరిలోకి దిగిన విశాఖపట్నం ఉత్తరం - నటరత్నం బాలక్రిష్ణ మరోసారి పోటీపడుతున్న హిందూపురంపై బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నారు.

హేమాహేమీలైన వీరు గెలుస్తారా? లేదా అన్న ఉత్కంఠ రాష్ట్రవ్యాప్తంగా ఉంది. కొందరిపై వ్యతిరేకత.. కొన్ని చోట్ల నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొనడంతో ఈ సీట్లు హాట్ సీట్లుగా మారాయి. ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది చెప్పడం కష్టంగా మారింది. అందుకే ఈ నియోజకవర్గాల్లో గెలుపు - మెజారిటీలపై బెట్టింగ్ రాయుళ్లు కోట్లు కుమ్మరిస్తున్నారు..