పట్టం ఎవరికి? :ఫలితాలు నేడే, ఎలక్షన్ కౌంటింగ్ ఎలా సాగనుంది? 

07:58 - May 23, 2019

 

42 రెండు రోజుల ఉత్కంఠ, గెలుపు మాది అంటే మాది అని అంచనాలూ, సవాళ్ళూ. ప్రజల తీర్పు ఏమిటో అన్న టెన్షన్ మొత్తంగా ఈసారి ఏపీ ఎన్నికలు కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాలేదు ఇటు తెలంగాణాలోనూ అదే ఆసక్తి. ఇక ఇదంతా ఒక ఎత్తయితే జాతీయ స్థాయి తీర్పు ఇంకో ఎత్తు. ఇంతకీ ఈసారికి ప్రజల తీర్పు ఏమిటి? 

మొత్తానికి అంతా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అటు జాతీయ పార్టీల హోరు, ప్రాంతీయ అంచనాల జోరు. ఈసారి నవ్యాంధ్ర ప్రజలు పట్టం కట్టింది ఎవరికి? మళ్ళీ చంధ్రబాబునే అందలం ఎక్కిస్తున్నారా? లేక జగన్ ని కోరుకున్నారా? కేంద్రంలో మళ్ళీ కమలం వికసిస్తుందా? లేక హస్తం గద్దెనెక్కనుందా? గత నలభై రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణా రెండు రాష్ట్రాల్లోనూ ఇవే చర్చలు. ఈ సారి పవన్ ప్రభావం ఎంత ఉండబోతుంది అన్న ఆలోచన కూడా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదంతా ఒక ఎత్తయితే జాతీయ స్థాయి పార్టీల సంగతేమిటన్నదీ ఇవాళే తెలిసి పోనున్నది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, వయ్యెస్సార్సీపీ సారధి జగన్ ఇళ్ళవద్ద భారీగా బలగాలని మోహరించారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పెద్దగా వేచి చూడక్కర్లేదు! మధ్యాహ్నం 12 కల్లా... ఫలితంపై ఒక అంచనా వస్తుంది. 2 గంటలకల్లా పూర్తి స్పష్టత వచ్చేస్తుంది.

175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో విజేతలెవరో తెలిసిపోనుంది, రాష్ట్రంలో అధికారం ఎవరిదో తేలిపోనుంది. గురువారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ప్రధాని ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రంలో 36చోట్ల 55 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కేంద్రాల్లోని టేబుళ్ల సంఖ్యను ఓట్ల లెక్కింపు ‘రౌండ్ల’ను నిర్ణయించారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 8 గంటలకు అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్లలెక్కింపు ప్రారంభమయ్యింది. ఎన్నికల అధికారులతోపాటు 200 మంది కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారు. ఈసీ ఆదేశాల ప్రకారం అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించిన ఈవీఎంలకు అనుబంధంగా ఉండే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. అంటే... రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీప్యాట్‌లను లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 3 నుంచి 6 గంటల సమయం పడుతుందని ఈసీ చెబుతోంది. అంటే మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఎవరు విజేతలో తెలిసిపోతుంది. 

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి తొలి ఫలితం తేలితే రాజమండ్రి రూరల్‌ స్థానం చివరలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి ఏపార్టీ అధికారంలోకి వచ్చినా వలసలు మాత్రం భారీగా ఉండే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. అంటే ప్రజా తీర్పు కూడా తారుమారయ్యే అవకాశాలూ బాగానే ఉన్నాయన్నమాట