ఆ పంట పండించటం నేరం అని తెలియదు: గసగసాల సాగుతో రైతుల అరెస్ట్

22:02 - March 7, 2019

*ఏపీలో ఎటువంటి అనుమతులు లేకుండా నల్లమందు సాగు 

*అది "పాపి"ష్టి పంట అని అధికారులకే అవగాహణ లేదు  

*చట్టాలు తెలియక చిక్కుల్లో పడ్డ రాయల సీమ రైతులు 

 

 

వంటల్లో వాడే మసాలా దినుసే కదా అనుకున్నారు, అన్ని పంటల్లాగే ఇదీ ఒక పంటే కదా అనుకొని సాగు చేసారు కానీ అది పైకి కనించే మసాలా పంటకాదు "పాపీ"ష్టి పంట  (Opium Poppy) అని వాళ్ళకు తెలియదు. ఆ అమాయకపు రైతులకే కాదు కొందరు వ్యవసాయాధికారులకే గసగసాలు (పాపి) పండించటం నేరం అన్న విషయమ్మీదే సరైన అవగాహణ లేదు. ఇదంతా ఎక్కడో కాదు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోనే జరిగింది. ఇప్పుడు తాముచేసిన పాపం ఏమిటొ అతెలియకుండానే అరెస్టయ్యారు కొందరు అమాయక రైతన్నలు. వివరాల్లోకి వెళ్తే...  

 ఏపీలో ఎటువంటి అనుమతులు లేకుండా గసగసాలు సాగు చేస్తున్న ఓ రైతును పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ కొండల్లో ఐదెకరాల్లో పంట సాగవుతున్నట్లు పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కడప జిల్లా ఇడుపులపాయలో, అనంతపురం జిల్లా ముదిగుబ్బలో భూమిని కౌలుకుతీసుకొని గుట్టుగా ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు అతనితోపాటు భూ యజమాని అయిన చిన్నక్క భర్త శ్రీరాములును కూడా అరెస్టు చేసి ఎన్‌డీపీఎస్ - 1985 చట్టం కింద కేసులు నమోదు చేశారు. కౌలుకుతీసుకొని గసగసాలు సాగుచేసిన నిందితులతో పాటు భూమి స్వంతదారు శ్రీరాములు కూడా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు అయితే నిజానికి ఆ పంట సాగు చేయటం నేరం అన్న సంగతే తమకు తెలియదనీ. గసగసాలు పండించమని తమకు ఇంకొకళ్ళు ఇచ్చిన సలహా ప్రకారమే ఆపనికి పూనుకున్నామనీ అమాయకంగా చెబుతున్నారా రైతులు. 


 అయితే ఇలాంటి సంఘటనే 2015లోనూ జరిగింది చిత్తూరు జిల్లాలోని రైతులు కొందరిని ఈ మొక్కని ఔషధాల తయారీకి వినియోగిస్తారని నమ్మించిన వ్యక్తివల్ల లక్షలాది రూపాయలు ఖర్చుచేసి తాము మోసపోయామని ఆ రైతులు వాపోయారు. ఈసారి కూడా అదే తరహాలో ఈ రైతులు మళ్ళీ మోసపోయి చిక్కుల్లో పడ్డారు. కొకైన్, హెరాయిన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలలో దీనిని ఉపయోగిస్తారు. అందుకే ప్రభుత్వం ఇందుకు కారకమైన గసగసాల సాగుపై నిషేధం విధించింది.  

గసగసాల సాగుమీద మన దేశంలో 1985 నుంచే నిషేధం ఉన్నా కనీసం వ్యవసాయ అధికారులకే దీనిమీద సరైన సమాచారం లేకపోవటం చూస్తూంటే పరిస్తితి ఎంత ధారుణంగా ఉందో అర్థమవుతోంది. గసగసాల కాయలనుండి మాదకద్రవ్యంగా ఉపయోగించే నల్లమందు మార్ఫిన్ ఉత్పత్తి అవుతుండటమే ఇందుకు కారణం. ఇదే పంట ఒకప్పుడు ఆఫ్గాన్ లాంటి దేశాల్లో ప్రధాన వ్యాపార వనరుగా మారింది. ఈ పాపిష్టి పంట మీదనే ఆధారపడి ఉగ్రవాద సంస్థలు తమ ఆయుధాలని కొనటానికి అవసరమైన డబ్బు సమకూర్చుకున్నారని కూడా ఆరోపణ ఉంది.

అయితే ఈ మొక్కలనుంచి సేకరించే ఓపియం (నల్లమందు) వల్ల కొన్ని లాభాలున్నాయి. నల్లమందును ఆరోగ్యకారకమైన కొన్ని రకాల ఔషధాల్లో కూడా వినియోగిస్తారు. ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి మందుల్లో దీనిని వాడుతారు. దగ్గు మందులు, నొప్పితెలియకుండా చేయడానికి వాడే మందుల తయారీలోనూ వాడుతారు. ముఖ్యంగా తీవ్రమైన క్యాన్సర్ రోగులకు వాడే ఔషదాల్లో ఎక్కువగా వినియోగిస్తారు.  మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కేంద్రం దీని సాగుకు అధికారికంగా అనుమతిస్తోంది.

ఈ పంట సాగు చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కొటిక్స్ జారీ చేసే లైసెన్స్ తప్పనిసరి. ఎన్నో ఆంక్షలు, అధికారుల తనిఖీలు, పర్యవేక్షణలో దీనిని సాగు చేయవలసి ఉంటుంది. దిగుబడి మెుత్తాన్ని తప్పనిసరిగా సీబీఎన్ ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే అమ్మాలి.దేశంలో ఎవరైనా ఎక్కడైనా అనుమతి లేకుండా ఓపియం పాపీ సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, విక్రయించినా తీవ్రమైన నేరమవుతుంది. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ చట్టం ప్రకారం కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. దోషులుగా తేలితే పది సంవత్సరాలకు పైగా జైలుశిక్ష, లక్షన్నర వరకు జరిమానా విధిస్తారు.

photo source:Google