అమెరికాలో వలసదారులపై కఠిన వైఖరి: ముక్కు ద్వారా ఫ్లూయిడ్స్‌

13:13 - February 2, 2019

అమెరికాలో వలసదారులపై అక్కడి సర్కారు వ్యవహరిస్తున్న కఠిన వైఖరిలో మరో కఠినమైన కోణం వెలుగులోకి వచ్చింది. అక్కడి సిబ్బంది వేధింపుల తాళలేక వారు నిరాహార దీక్షకు దిగుతున్నారు. వీరి దీక్షను భగ్నం చేసేందుకు అధికారులు ముక్కు గొట్టాల ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. టెక్సాస్ లోని ఎల్ పాసో సెంటర్ లో దీక్ష చేస్తున్న 11 మందిలో ఆరుగురికి బలవంతంగా ప్లూయిడ్స్ ఎక్కించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఈ చర్యపై భారతీయ అమెరికన్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టెక్సాస్ సెంటర్ లో అదుపులో ఉన్న ఇద్దరు భారతీయుల లాయర్ అయిన రూబీ కౌర్ మాట్లాడుతూ.. తమ క్లయింట్లు దక్షిణ సరిహద్దు ద్వారా ఆరు నెలల కిందట దేశంలోకి ప్రవేశించారని వారే స్వయంగా అధికారుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. వారిద్దరూ కూడా నిరాహార దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. అయితే వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ముక్కు ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించారని విమర్శించారు. ఇలా బలవంతంగా ప్లూయిడ్స్‌ ఎక్కించడం వల్ల ముక్కు నుంచి రక్తస్రావం అవుతుందని, వాంతులు కూడా అవుతున్నట్లు వారు ఫోన్‌ ద్వారా చెప్పినట్లు లాయర్స్‌ తెలిపారు.  దేశం నుంచి వెళ్లగొడతామని బెదిరించడమే కాకుండా తమ కేసులను తేల్చకుండా సిబ్బంది మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో అమెరికాలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి ఇప్పటికే వివిధ డిటెన్షన్ సెంటర్లలో ఉన్న భారతీయులతోపాటు ఇతర విదేశీయుల పరిస్థితి దయనీయంగా ఉంది.   అమెరికాకు చెందిన ఫ్రీడమ్ ఫర్ ఇమ్మిగ్రెంట్స్ అనే స్వచ్ఛంద సంస్థ కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టినా ఫియాల్హో మాట్లాడుతూ... ఎల్పాసో డిటెన్షన్ సెంటర్లో 30 మంది వరకు నిరాహార దీక్ష చేస్తున్నారని అయితే ఐసీఈ అధికారులు మాత్రం ఈ సంఖ్యను తగ్గించి చెబుతున్నారని ఆరోపించారు. బలవంతంగా ప్లూయిడ్స్ ఎక్కించడం క్రూరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఎల్పాసో సెంటర్లో 11 మంది భారతీయులు నిరాహార దీక్ష చేస్తున్నారని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బాధితులకు బలవంతంగా ఆహారం అందించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని మండిపడింది.