అమెరికా చెప్పినట్లు మనం ఇక తప్పకుండా చేయాల్సిందేనా...?

12:04 - April 24, 2019

మీ ఇంటికి అవసరమైన సరుకులు మీకు నచ్చిన షాపులో కొనుక్కోవటం కామన్. కానీ.. ప్రభుత్వం ఫలానా షాపులోనే కొనాలి.. మీకు నచ్చిన షాపులో కొనే వీలు లేదంటే ఎలా ఉంటుంది?  కాలిపోద్ది. ఇప్పుడు ఇదే పరిస్థితి భారత్‌కు ఎదురైంది. వివరాల్లోకి వెలితే...పేరుకు తగ్గట్లే పెద్దన్నగా వ్యవహరించే అమెరికా.. తన రూపాన్ని మరోసారి ప్రదర్శించింది. ఇరాన్ తో తనకున్న పంచాయితీ నేపథ్యంలో ఆ దేశం నుంచి ఎవరూ ముడిచమురు దిగుమతి చేసుకోవద్దన్న మాటను చెప్పటమే కాదు..భారత్ లాంటి దేశాలకు గట్టిగా చెప్పటం గమనార్హం. అమెరికా చెప్పినట్లుగానే భారత్‌ ఊ కొట్టినట్లుగానే పరిస్థితులు కనిపించడం కూడా గమనించాల్సిన పరిస్థితి. అమెరికాకు ఆగ్రహం రాకూడదన్న ఉద్దేశంతో భారత సర్కారు తగ్గి నిర్ణయం తీసుకోవటం దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఉండటాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అయితే...అమెరికా మాటకు తగ్గట్లే భారత సర్కారు సైతం.. ఇరాన్ దగ్గర నుంచి కాకుండా.. వేరే వారి దగ్గరి నుంచి ముడిచమురు కొంటే మన చేతి చమురు వదలటం ఖాయం. ఎందుకంటే.. మిగిలిన దేశాలతో పోలిస్తే.. ఇరాన్ నుంచి మనం కొనే చమురు ధర తక్కువే కాదు.. చాలానే సౌకర్యాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అలాంటివేమీ ఉండదు. దీని ప్రభావం మనమీద నేరుగా పడుతుంది. ఇరాన్ నుంచి కొనుగోలు చేసే ముడిచమురుకు ఇవ్వాల్సిన మొత్తాన్ని డాలర్ల రూపంలో కాకుండా రూపాయిల్లో చెల్లించే వెసులుబాటు.. రెండు నెలల పాటు అప్పు ఇవ్వటం.. ఉచితంగా డోర్ డెలివరీని అందిస్తోంది. ఇతర దేశాల దగ్గర ముడిచమురు కొంటే ఇలాంటివేమీ ఉండదు. అంతేనా.. ఇరాన్ తో మనకున్న డీల్స్ నేపథ్యంలో చాబహార్ పోర్టు కోసం భారత్ రూ.1600 కోట్లు పెట్టుబడిగా పెడుతోంది. ఇరాన్ తో వ్యాపారం ఆపేస్తే.. మనం చేసే ఖర్చుకు ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. భారీగా నష్టపోయే పరిస్థితి. పెద్దన్నతో స్నేహం చెడిపోకూడదు సరే.. అలా అని అందుకు భారీ ఖర్చు భరించాల్సి రావటం తెలివైన పనేనంటారా?