అంబేద్కర్ అంబేద్కరిజం

14:57 - April 14, 2019

కొలంబియా యూనివర్సిటీ గత మూడు వందల సంవత్సరాలలో ఆ యూనివర్సిటీకి సంబందించి మేధావి ఎవరా అని గణిస్తే... భీమ్రావ్ సాహెబ్ అంబేద్కర్ అపార మేధావిగా ఎంచబడ్డారు. ఆయన గౌరవార్థం కొలంబియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం ప్రధాన ద్వారం వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించి ఆ మహోన్నత మేధావిని గౌరవించింది. ఉస్మానియా యూనివర్సిటీ అంబేద్కర్ కు డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ప్రధానం చేసిన మొదటి భారత దేశ విశ్వ విధ్యాలయం. 


 మనువాదానికి వ్యతిరేకంగా అందులోని కుల పీడన, స్త్రీ వివక్షకు వ్యతిరేకంగా జీవిత పర్యంతం అలుపెరుగని పోరాటం చేసిన, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రూపశిల్పి, నిమ్న కులాల హక్కులకు , రాయితీలకూ రాజ్యాంగ రక్షణ కల్పిమంచిన దళిత ఉధ్యమ నేత, భూమిని జాతీయం చేయాలి, పరిశ్రమలు ప్రభుత్వ పరంగా నిర్వహించాలి, భీమా వంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధీనం లో ఉండాలని సామ్యవాద సిద్దాంత ఆచరణకోసం పోరాడిన సోషల్ డెమోక్రాట్. భారత జాతి గర్వించదగిన బహుముఖ మేదావి భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. 

                                                                       
  ఎల్ఫిన్ స్టోన్ హై స్కూలులో చేరిన మొట్టమొదటి అంతరాని కులానికి చెందిన వ్యక్తి అంబేద్కర్. బాల్యం లో బడికి వెళ్ళిన సందర్భంలో అతను తరగతి గదిలో మిగతావిధ్యార్థులతో కలిసి కూర్చునే పరిస్తితి లేదు. తరగతి గది బయట తాను వెంట తెచ్చుకున్న గోనెపట్టా వేసుకుని కూచుని చదువుకోవాల్సి వచ్చింది. ఉపాధ్యాయులు కూడా ఆయన పట్ల సరైన శ్రద్ద కనబరిచే వారు కాదు. ఆఖరికి నీళ్ళు తాగాలన్నా అక్కడ ఉన్న నీళ్ళ కుండని గానీ, గ్లాసుని హ్గానీ తాకటానికి వీలు లేదు. ప్యూన్ వచ్చి పైనుంచి దారగా పోస్తే దోసిలి పట్టి నిటిని తాగాలి. ఒక వేళ ఎప్పుడైన ప్యూన్ రాకపోతే ఆరోజు నెళ్ళు తాగటానికి కూడా వీలు లేదు. తర్వాతి కాలంలో ఆయన ఒక చోట "నో ప్యూన్- నోవటర్" అని తన రచనలో ఉదహరించారు కూడా. డా. అంబేద్కర్ ఇంటిపేరు అంబావడేకర్. కానీ ఆయనని ఇష్టపడ్డ బ్రాహ్మణ టీచర్ మహదేవ అంబేద్కర్ తన ఇంటిపేరునే స్కూల్ రికార్డ్స్ లో బాబా సాహెబ్ ఇంటిపేరుగా మార్చటంతో అప్పటినుంచీ భీం రావ్ రాంజీ ఇంటిపేరు అంబేద్కర్ గా మారిపోయింది. 

 

                                                         
 1906లో ఆయనకి 15ఏళ్ళ వయసుఓ 9 సంవత్సరాల రమాభాయి తో వివాహం జరిగింది. 1907 లో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై, బొంబాయి యూనివర్సిటీకి అనుబందమైన ఎల్ఫిన్స్టన్ కాలేజ్ లో చేరారు. ఆ కాలేజ్ లో చేరిన మొట్టమొదటి అంతరాని కులానికి చెందిన వ్యక్తి బాబా సాహెబ్ మాత్రమే. అక్కడే అర్థ శాస్త్రం మరియూ రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి 1912 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో ఉధ్యోగం సంపాదించి 15 సంవత్సరాల భార్యతో జీవితాన్ని మొదలు పెట్టారు. 1913 బరోడా సంస్థాన స్కాలర్షిప్ తో కొలంబో యూనివర్సిటీలో 1915లో అర్థశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసారు. 1927లో అర్థశాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత మరెన్నో పోస్టు గ్రాడ్యుయేషన్లు, డాక్టరేట్లూ, న్యాయ శాస్త్ర పట్తాలు వంటివి సాధించారు. 


  బరోడా సంస్థానం నుంచి అందిన సహకారంతో విధ్యనభ్యసించటం కారణంగా సంస్థానాధీషుడు గైక్వాడ్ కు మిలటరీ సెక్రటరీగా పనిచేయాల్సి వచ్చింది. అయితే కొంత కాలం తర్వాత ఆ ఉధ్యోగాన్నీ వదిలేశారు. పెరుగుతున్న కుటుంబాన్ని పోషించటానికి ప్రైవేట్ ట్యూటర్ గా, ఎకౌంటెంట్ గా ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ గా పని చేయాల్సి వచ్చింది. కానీ అంబేద్కర్ అంటరాని కులానికి చెందిన వాడని తెలియగానే ఆయన ఉధ్యోగం వదిలేయాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే సైడ్నాం కాలేజ్ లో రాజకీయ అర్థ సాస్త్ర ఫ్రొఫెసర్ గా చేరారు. విధ్యార్థులు ఆయన భోదనని ఇష్టపడ్డా తోటి ఉపాధ్యాయులు మాత్రం ఆయనని మంచినీళ్ళు కూడా తాకనివ్వలేదు. ఆయన అక్కడ కూడా అంటరాని జీవితాన్నే గడపాల్సి వచ్చింది. 

                                                               
 1924లో దఖిత విముక్తి సంఘం స్థాపించి మహారాష్ట్రలోని మహర్ లో వేలాది మంది దళితులతో ఊరేగింపుగా వెళ్ళి చౌదర్ చెరువు నీరు తాగి అంటరాని తనానికి వ్యుతిరేకంగా పోరాటాన్ని మొదలు పెట్టారు. దేవాలయాల్లో దళితుల ప్రవేశానికి ఉధ్యమాన్ని నడిపారు. హిందూమతం లోని మనువాదానికి, కులపీడనకు, స్త్రీ వివక్షకూ, మూఢనమ్మకాలకూ వ్యతిరేకంగా పోరాటం సాగించారు.  మనుస్మృతిని బహిబ్రంగంగా తగలబెట్టారు. 1935లో తన వేలాదిమంది అనుచరులతో బౌద్దమతాన్ని స్వీకరించి కుల భూయిష్టమైన హిందూ మతాన్ని వదిలి వేశారు. 

                                                                       
1936లో ఇండియన్ ఇందిపెండేంట్ లేబర్ పార్టీ స్థాపించి భొంబాయి నియోజకవర్గంలో ఎస్.ఏ డాంగే వంటి కమ్యూనిస్టు నాయకులతో కలిసి ఎన్నికల్లో పాల్గొన్నారు. బొంబాయి కౌన్సిల్ మంత్రుల జీతభత్యాలు నెలకు రూ. 500 పెంపునకు ప్రతిపాదన వచ్చినప్పుడు, ప్రభుత్వం ప్రజల డబ్బుకు దర్మకర్తలుగా ఉందాలి కానీ దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తూంటే మనం మాత్రం ఎక్కువ జీతాలు తీసుకోవటం సరికాదని నెలకు జీతం రూ.75 మాత్రమే ఉందాలని వాధించారు. 1947 ఆగస్టు 29 నుండీ 1950 జనవరి 24 వరకూ రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ గా పనిచేసిన అంబేద్కర్ రాజ్యాంగ రచనల కీలక పాత్ర పోషించారు.  

పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పించటం, మత స్వేచ్చ కలిగి ఉండటం , అంటరాని తనాన్ని నిర్మూలించటం, దళితులకూ ఆదివాసీలకూ ఇతర వెనుకబడిన కులాలకూ రిజర్వేషన్లు కల్పించటం ద్వారా సామాన్యులకు రాజ్యాంగ రక్షణ కల్పించారు పారిశ్రామిక, వ్యవసాయ కార్మికుల  ద్వారా భారత దేశం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని నమ్మారు. మొదటి ఫైనాన్స్ కమీసన్ ను ఏర్పాటు చేశారు. హిమిల్టన్ యంగ్ కమీషన్ కు సమర్పించిన ఆలొచనల ఆధారంగా  రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేయబడింది. 1941లో అప్పటి బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం హిందూ న్యాయ శాస్త్రానికి సవరణలు చేయటానికి కమిటీ వేసింది. ఆ కమిటీ భారత దేశమంతా పర్యటించి అభిప్రాయ సేకరణ గావించి హిందూ కోడ్ బిల్లును రూపొందించింది.

డా. అంబేద్కర్ దానిని పరిశీలించి సభలో ప్రవేశపెట్టాలనుకున్నారు. అది తెలుసుకున్న సనాతన వాదులూ, మనువాదులూ గగ్గోలు పెట్టారు. స్వాతంత్రానంతరం 1951లో న్యాయ శాఖా మంత్రిగా పని చేస్తున్న అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ప్రవేశ పెట్టాలనుకున్నారు. ప్రవేశపెట్టటానికి ముందే అప్పటి ప్రధాని నెహ్రూ మద్దతిస్తానని అన్నారు. బిల్లు ప్రవేశ పెట్టిన రోజు వామపక్షాలు తప్ప మిగతా వాళ్ళంతా గగ్గోలు పెట్టారు. నెహ్రూ ప్రభుత్వాన్ని కూల్చి వేసామని బెదిరించారు కూడా. అయినా నెహ్రూ వెనక్కి తగ్గలేదు. అప్పటి హోం మంత్రి సర్దార్ పటేల్ మరికొంతమందిని కలుపుకొని రాష్ట్రపతి బాబూ రాజేంద్ర పొరసాద్ దగ్గర మొర పెట్టుకున్నారు.

                                              

దాంతో పార్లమెంటు ఆమోదం పొందినా రాష్ట్రపతిగా నేను సంతకం పెట్టనని రాజేంద్ర ప్రసాద్ మనువాదులకు అనుకూలంగా, స్త్రీలకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశారు. రాష్ట్రపతి సంతకం పెట్టకపోతే ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి బిల్లుని వెనక్కి తీసుకుమ్మని నెహ్రూ కోరతంతో ఆ బిల్లుని వెనక్కి తీసుకొని తన న్యాయ శాఖా మంత్రిపదవికి రాజీనామా చేశారు బాబా సాహెబ్. ఆ హిందూకోడ్ బిల్లు అమలులోకి వస్తే పురుషాధిక్యత నశిస్తుందన్నా భయంతో ఆ బిల్లుని నిరోదించారు. అప్పటినుండీ ఇప్పటివరకూ మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశ పెట్టకుండా వాయిదా వేయటంలో అన్ని పార్టీలూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. 


      1935లో ధీర్ఘ కాలిక అనారోగ్యంతో బాబా సాహెబ్ బార్య రమాభాయి కన్ను మూశారు. ఆ తర్వాత 1948 ఏప్రిల్ 15న మాయా సవిత అనే బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకున్నారు అంబేద్కర్. మరణానంతరం 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారత రత్నని ఆయనకు సమర్పించుకుంది భారత దేశం. ఆయన మరణానంతరం ఆయన రచనలకు ఎంతో ప్రాచుర్యం లభించింది. ఈ దేశం మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలన్నది మనువాదుల కుట్ర. దీనినికి వ్యతిరేకంగా అంబేఫ్కర్ తన కాలంలో ఎ4ంతో పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితంగానే రాజ్యాంగంలో కొన్ని హక్కులూ, రిజర్వేషన్ల వంటివి నిమ్న జాతులకు, మైనారిటీలకూ కల్పించ బడ్డాయి. వీటిని నామమాత్రం చేయటానికి నేటి పాలకులు కుట్రల్ చేస్తూనే ఉన్నారు. ఈ విధానాలవల్ల ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వర్గాలకూ, మైనారిటీలకూ తీవ్ర అన్యాయం జరుగుతోంది దీన్ని ఎదుర్కోవాలంటే అంబేద్కరిస్టులూ, వామ పక్ష వాదులూ కలసి ఐక్యంగా పని చేయాల్సిన అవసరం ఉంది. 

                                                                                                                                    వ్యాసకర్త: కే ఎస్ ఎన్ మూర్తి                                                                                                                                                                               9177942384