ఇక బన్నీ బిజీ బిజీనట!

13:05 - March 5, 2019

నిన్న సుకుమార్ తో అల్లు అర్జున్ 20 ఉంటుందన్న ప్రకటన చూసి ఫ్యాన్స్ ముందు షాక్ అయినా తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు.  అల్లు అర్జున్ కు మొదటి బ్రేక్ ఆర్య ఇచ్చింది సుకుమారే కాబట్టి ఆ రకంగా కూడా ఆయన మీద ఫ్యాన్స్ కు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది.  రామ్ చరణ్ తో రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తీసి తనలో మాస్ దర్శకుడిని ప్రపంచానికి పరిచయం చేసిన సుకుమార్ బన్నీని ఎలా చూపిస్తాడో అనే ఉత్సుకత అప్పుడే మొదలైంది. దీని కన్నా ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ పూర్తి చేయాల్సిన బన్నీ వీటితో పాటు మరో మూడు ప్రాజెక్టులు లైన్ లో ఉంచాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు పూర్తయ్యాక మురుగదాస్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందట. అదీ కాగానే ఇంతకు ముందు కమిట్ అయ్యి అనివార్య కారణాల వల్ల ఆపేసిన విక్రం కుమార్ సినిమా కూడా లైన్ లోకి వస్తుంది. పూర్తిగా వేరే కథతో ఇది రూపొందించేందుకు ఇప్పటికే ప్రాధమిక చర్చలు జరిగాయని సమాచారం. ఈ నాలుగు కాకుండా మరో బాలీవుడ్ మూవీ కూడా బన్నీ చేయబోతున్నట్టు హాట్ న్యూస్. అయితే దాని తాలుకు ఏ చిన్న వివరం బయటికి రాకుండా చాలా రహస్యంగా డిస్కషన్ చేస్తున్నారు. ఎనిమిది నెలల నుంచి షూటింగ్ స్పాట్ లో లేని అల్లు అర్జున్ ఈ ఐదు సినిమాలకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ తో బిజీగా ఉన్నాడని కేవలం రెండు లేదా రెండున్నర ఏళ్ళలో ఈ ఐదు సినిమాలనూ ప్రేక్షకులకు కానుకగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట.