ఈ ప్రయాణంలో నా బలం లేదు: అల్లు అర్జున్‌

12:47 - January 20, 2019

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఎన్నో సామాజిక మాధ్యమాల్లో జనమంతా మునిగితేలుతున్నారు. రోజు రోజుకూ సోషల్ మీడియా ప్రభావం మరీ ఎక్కువవుతుండటంతో సెలెబ్రిటీలు, సామాన్య జనం మధ్య దూరం తక్కువవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు హీరో హీరోయిన్లు ట్విట్టర్‌లో బాగా యాక్టీవ్‌గా ఉంటున్నారు. వారిలో ఒకరే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 2015వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ట్విట్టర్ లోకంలో అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో.. తన అభిమానులకు బాగా చేరువవుతూ వచ్చారు. దీంతో ఆయన ఫాలోవెర్స్ సంఖ్య అమాంతం పెరుగుతూ వచ్చింది. అలా అలా ఇప్పటివరకు 3మిలియన్ (30లక్షల మంది) ఫాలోవెర్స్ ఆయన ఖాతాలో చేరిపోయారు. దీంతో చాలా సంతోషంగా ఫీలయిన బన్నీ ఫాలోవర్స్‌ను ఉద్దేశించి ఒక ట్విట్‌ చేశాడు. '' ట్విట్టర్‌లో నన్ను ఫాలో అవుతున్న3 మిలియన్ల మందికి ధన్యవాదాలు. నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నందుకు నిజంగా మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా అవన్నీ తక్కువే. నేను చేస్తున్న ఈ ప్రయాణంలో నా బలం లేదు.. మీ దీవెన ఉంది. అందరికీ కృతజ్ఞతలు'' అని పేర్కొన్నారు బన్నీ. ఈ ట్వీట్ చూసి మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు.