వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన అలీ...జనసేనాపై క్లారిటీ ఇచ్చారట!

13:04 - March 11, 2019

ప్రముఖ సినీ నటుడు ఎట్టకేలకు తన ఊగిసలాటకు చెక్ చెప్పారు.  సోమవారం  ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ ను కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  కొద్దిరోజులుగా వైసీపీ టీడీపీ జనసేన అధినేతలతో భేటి అయిన అలీ చిట్టచివరకు వైసీపీలో చేరారు. వైసీపీలో జగన్ సమక్షంలో అలీ చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు..అయితే వైసీపీ నుంచి పోటీచేస్తారా.? ఎక్కడి నుంచి అన్న ప్రశ్నలపై అలీ స్పందించారు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సందర్భంగా చాలా మందికి హామీ ఇచ్చారని.. ఆ కారణంగా తనకు టికెట్ దక్కే అవకాశం లేదని అలీ స్పష్టం చేశారు. 1999లో ఓ పార్టీ కండువా కప్పుకున్నానని.. మళ్లీ ఇప్పుడు 2019లో వైసీపీ కండువా కప్పుకున్నానని తెలిపారు.  ఒక వేళ జగన్ తనకు రాజమండ్రి కానీ.. విజయవాడ టికెట్ ఇస్తే తప్పకుండా పోటీచేస్తానని అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తన చిరకాల మిత్రుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ను కాదని వైసీపీలో చేరడంపై అలీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అలీ సూటిగా సమాధానం ఇచ్చారు.. ‘స్నేహం వేరు.. రాజకీయం వేరు.. పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు.. ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టే ఫీల్ అవుతాను.. నాకు అన్నీ పార్టీలు - అందరూ తెలిసినవారే.. ‘జగన్ వస్తే అభివృద్ధి బాగుంటుందని జనం నమ్ముతున్నారు.  అందుకు చేయూతని ఇద్దామనే ఆలోచనతోనే నేను జగన్ కు మద్దతుగా వైసీపీలో చేరాను’ అని అలీ వివరణ ఇచ్చారు. అంతేకాదు గతంలో చంద్రబాబును పవన్ ను  కలిసింది రాజకీయం కోసం కాదని.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికేనని అలీ స్పష్టం చేశారు.