మద్యం తాగుడులో తెలంగాణదే పైచేయి!

13:05 - January 2, 2019

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే వేళ తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై పొంగింది.  ఇందులో తెలంగాణదే పైచేయి.  తెలంగాణలో డిసెంబరు 31న రూ.133 కోట్ల మద్యం అమ్ముడుపోగా.. ఏపీలో ఆ విలువ రూ.103 కోట్లుగా నమోదైంది. అబ్కారీ శాఖ ఈ మేరకు మద్యం అమ్మకాల లెక్కలు విడుదల చేసింది. అంటే  ఒక్క రోజులో రెండు రాష్ట్రాల ప్రజలు ఏకంగా రూ.236 కోట్ల రూపాయల విలువైన సరకును తాగేశారు. సాధారణంగా తెలంగాణలో రోజుకు రూ.50-70 కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగుతాయి. ఏపీలో ఆ సగటు రూ.45-55 కోట్లుగా ఉంది.డిసెంబరులో మొత్తంగా తెలంగాణలో రూ.1962 కోట్ల మద్యం విక్రయించారు. ఏపీలో ఈ విలువ రూ.1732 కోట్లుగా నమోదైంది. దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ఖజానాలకు భారీగా ఆదాయం సమకూరింది. తెలంగాణలో జిల్లాల వారీగా డిసెంబరు 31 నాటి గణాంకాలను పరిశీలిస్తే.. అత్యధికంగా హైదరాబాద్ లో రూ.19.5 కోట్లు రంగారెడ్డిలో రూ.15.30 కోట్లు ఉమ్మడి వరంగల్ లో రూ.18 కోట్లు మేడ్చల్ జిల్లాలో రూ.11.90 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తంగా 2018లో తెలంగాణలో రూ.20 వేల కోట్ల మద్యాన్ని విక్రయించారు.