చావు, పుటుకులకు అంతా సమానమే: కోట్లకు అదిపతి...అతని మరణం చూస్తే...!

12:13 - April 2, 2019

చావు, పుటుకలు అందరికీ సమానమే. కానీ అవి ఉన్నవాడికి ఒకలా...లేనివాడికి మరోలా వుంటాయన్నట్లు ప్రవర్తిస్తుంటారు. కానీ ఎన్ని డబ్బులు వున్నా కానీ చావనేది చెప్పిరాదు. ఎంత డబ్బు ఉంటే మాత్రం.. పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకుపోరన్న మాటను నిజం చేసే  ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. వందల కోట్ల ఆస్తిపరుడుగా పేరున్న అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ ఇమ్మడి సదాశివ వరప్రసాదరావు ఆకస్మిక మరణం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెలితే...సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కౌంటర్ నుంచి బయటకు వస్తున్న వేళ.. ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనకు నీళ్లు తాగించారు. హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఆయన ఎవరు? ఎక్కడి వారు?  ఆయన నేపథ్యం ఏమిటన్న వివరాలు నాలుగు గంటల తర్వాత కానీ బయటకు రాలేదు. ఆయన దగ్గరి లభించిన ఆధారాలతో మృతుని బంధువులకు ఆయన పరిస్థితిపై సమాచారం అందించారు. ఆయన దగ్గర లభించిన ఆధారాలతో బందువులకిచ్చిన సమాచారంతో అతను అగ్రీగోల్డ్‌ వైస్‌ ఛైర్మన్‌గా గోపాలపురం పోలీసులు అప్పుడు గుర్తించడం జరిగింది. ఆయన మృతదేహాన్ని గాంధీకి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కోట్లకు అధిపతి చనిపోతే ఎవరూ గుర్తించకపోవటం చూసినప్పుడు.. చావుతో ఎవరూ ఏమీ వెంట తీసుకెళ్లలేరన్న నిజం మరోసారి నిరూపితమైంది. అయితే...విజయవాడకు చెందిన వర ప్రసాద్ హైదరాబాద్ కు ఎందుకు వచ్చారు?  అన్న సమాచారం బయటకు రాలేదు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ ఆకస్మిక మృతిపై సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ అయిన పోస్టులు చూసినప్పుడు మరణించిన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా? అన్న భావన కలగటం ఖాయం. అయితే.. లక్షలాది మంది నమ్మి నష్టపోవటం.. ఆగ్రిగోల్డ్ బకాయిల పుణ్యమా అని పలువురు మరణించటం లాంటివి గుర్తుకు వచ్చినప్పుడు.. సోషల్ మీడియాలో వెల్లడైన ఆగ్రహావేశాలు అంతో ఇంతో అర్థవంతంగా అనిపించక మానదు.