ఆగ్రహాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం: మోడీ పై 110 తమిళ రైతుల పోటీ

14:44 - March 23, 2019

*మరో కొత్త పద్దతిలో తమిళ రైతుల నిరసన 

*వారణాసిలో మోడీకి పోటీగా 100 మంది నామినేషన్లు 

*మోడీ దేశంలో ఎక్కడ పోటీచేసినా ఇలాగే చేయాలంటూ పిలుపు 

డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జరిగిన తమిళ రైతుల పోరాటం అందరికీ గుర్తుండే ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది.కావేరీ జలాల వివాద పరిష్కారం, పంట రుణాల సమస్య, మద్దతుధర, ఆత్మహత్యకు పాల్పడిన రైతులను ఆదుకోవాలంటూ అప్పట్లో రైతులు ఆరుబయటే వంటావార్పూ చేసుకుంటూ తమ నిరసన తెలియజేశారు. నిరసనలో భాగంగా, తమ మూత్రాన్ని తామే తాగటం వంటి అత్యంత దయనీయమైన పద్దతులని ఆ రైతులు అనుసరించినా. తమిళ సినీ పరిశ్రమకూడా రైతులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నా పట్టించుకోలేదు ప్రభుత్వం.

అందుకే మరో కొత్త తరహా నిరసనకి తయారయ్యారు ఆ రైతులు. రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా భారీ సంఖ్యలో రైతుల్ని మోదీపై పోటీకి దించాలని త్రిచికి చెందిన దక్షిణాది నదుల అనుసంధాన సంఘం తెలిపింది.  మోదీ పాలనలో దేశవ్యాప్తంగా రైతులు అసంతృప్తిగా ఉన్నారని వాదన. ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మోదీపై పోటీ చేయడానికి 110 మంది తమిళ రైతులు సిద్ధం అవుతున్నారు.

మోదీ పోటీ చేయనున్న వారణాసి నియోజకవర్గంలో వీరు నామినేషన్ వేయనున్నారు. మోదీపై 110 మంది తమిళ రైతుల్ని వారణాసిలో పోటీకి దించుతున్నట్లు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను ప్రకటించారు.   తాజాగా ప్రధాని మోదీ దేశంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయనపై నామినేషన్‌ వేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు అయ్యాకన్ను ప్రకటించారు.