ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌: ఇక మీ ఇష్టం వచ్చినట్టు కుదరదు

12:42 - March 30, 2019

* లైవ్‌ స్ట్రీమింగ్ లను మానిటర్‌  చేయనున్న ఫేస్‌బుక్‌  

*ఫేక్‌ న్యూస్‌,  హింసాత్మక  వీడియోలను నిరోధించడానికే

 *క్రైస్ట్‌చర్చ్‌ దారుణం నేపథ్యంలో నిర్ణయం 

 

సోషల్ మీడియా దిగ్గజం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. తను యూజర్లకోసం అందుబాటులోకి తెచ్చిన ఫీచర్లు దుర్వినియోగం అవుతున్నాయన్న విషయంలో పునరాలోచనలో పడిన ఫేస్ బుక్ గోప్యతా ఉల్లంఘనల ఆందోళన, న్యూజిలాండ్‌ నరమేధం సంఘటనల తరువాత పలు సంస్కరణలకు పూనుకుంటోంది. ఇటీవల శ్వేత జాతీయవాద, వేర్పాటువాద పోస్టులను, ప్రసంగాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించిన ఫేస్ బుక్ ఇప్పుడు ఇంకో దిద్దుబాటు చర్యని కూడా తీసుకోనుంది. ఇక పై యూజర్లు విచ్చల విడిగా చేసే  ఫేస్‌బుక్‌ లైవ్‌లను మానిటర్‌ చేయనుంది. ఈ మేరకు కొన్ని ఆంక్షలు విధించాలని కూడా నిర్ణయించింది.  అంటే ఇకపై ఫేస్‌బుక్‌ లైవ్‌లపై ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట. 

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని ఆల్‌ నూర్‌ మసీదులో కాల్పులకు పాల్పడిన దుండగుడు బ్రెంటన్‌ టరెంట్‌ దాడినంతా ఫేస్‌బుక్‌లో గోప్రో కెమెరా సాయంతో ప్రత్యక్ష ప్రసారం చేసి కర్కషత్వాన్ని ప్రదర్శించాడు. మొత్తం 17 నిమిషాలపాటు ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ముందుగా ఫేస్‌బుక్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో తనను తాను పరిచయం చేసుకుని.. వెంట తెచ్చుకున్న ఆయుధాలను చూపించాడు. అనంతరం కారును ఆల్‌ నూర్‌ మసీదు పక్కనే నిలిపి.. మసీదులోకి ప్రవేశించాడు. భవనం తలుపు వద్దకు చేరుకోగానే కాల్పులు ప్రారంభించాడు. కనిపించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు.

ఫేక్‌ న్యూస్‌,  హింసాత్మక  వీడియోలను నిరోధించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని కింగ్ ఆఫ్ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌ పేర్కొంది. న్యూజిలాండ్ ప్రధాని జసిందా అర్డర్న్ ఈ ఘటనపై ఆదివారం ఫేస్‌బుక్‌ను ప్రశ్నించిన నేపథ్యంలో సంస్థ స్పందించింది. 

న్యూజిలాండ్‌ నరమేధం ఘటనలో నిబంధనలు ఉల్లంఘించే కంటెంట్‌ తీసివేయడానికి తీవ్రంగా శ్రమించామని ఫేస్‌బుక్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన 24 గంటల్లోనే 15 లక్షల వీడియోల ఫుటేజ్‌లను తొలగించామని పేర్కొంది.అంతేకాక రెండు మసీదుల్లోనూ దాడికి పాల్పడ్డ నిందితుల ఖాతాలను వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తొలగించినట్లు ఫేస్‌బుక్‌ ట్వీట్‌ చేసింది.