రేణుదేశాయ్‌ కి మళ్లీ పెళ్లంట

18:11 - August 12, 2018

హైదరాబాద్ : లవ్‌..! జీవితంలో ఒక్కసారే పుడుతుంది. పదేపదే  ప్రేమలో పడలేం.. మళ్లీ పెళ్లి  చేసుకోబోతున్నందుకు సంతోషంగానే ఉన్నా.. అంత ఉత్సాహంగా మాత్రం లేదు.. రేణుదేశాయ్‌ మనసులో మాటలు ఇవి.  తాను పెళ్లి చేసుకుంటున్నట్టు  రేణు ప్రకటించడంతో అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. దీనిపై రేణు మాజీభర్త పవన్‌కూడా స్పందించారు. రేణుదేశాయ్‌కి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేయడం ఆసక్తిగా మారింది. 

తాను పెళ్లికి రెడీ అవుతున్నట్టు ఓ ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూలో నటి రేణుదేశాయ్‌ తెలిపారు. ఈ పెళ్లిని పెద్దలే కుర్చారని ఆమె తెలిపారు. కాని పెళ్లి చేసుకోవడం సంతోషంగానే ఉన్నా.. ఏదో కొంత వెలితిగానే ఉందని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో ప్రేమ అనేది ఒకేసారి పుడుతుందని.. పదే పదే ప్రేమలో పడలేమని రేణు అనడం ఆసక్తిగా మారింది.అయితే తనకు కాబోయే భర్త చాలా ప్రశాంతంగా ఉంటారని, జీవితంలో కొత్తమలుపు తనలో ఉద్వేగం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. 

అయితే  సహజీవనం ఎందుకు చేయకూడదంటూ తన స్నేహితులు కొందరు సలహా ఇచ్చారని ..కాని తనకు అలాంటి సంబంధాలపై నమ్మకం లేదన్నారు రేణుదేశాయి్‌.  భారతీయ సంప్రదాయం ప్రకారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి అనుకుంటున్నాని.. పెళ్లిపై తనకు  నమ్మకం ఉందన్నారు. ఇక  తాను రెండో పెళ్లి చేసుకుంటున్నందుకు అకీరా ఎలాంటి బాధపడటం లేదని.. నిజానికి తను చాలా ఉత్సాహంగా ఉన్నాడని రేణుదేశాయ్‌ తెలిపారు.

రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రేణుదేశాయ్‌ ప్రకటించడంతో.. మాజీ భర్త పవన్‌ కల్యాణ్‌ విషెస్‌ చెప్పారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న రేణూ గారికి  హృదయపూర్వక శుభాకాంక్షలు అని ట్వీట్‌ చేశారు. పెళ్లి చేసుకోబోతున్న సమయంలో రేణుదేశాయి్‌ ట్విటర్‌  నుంచి తప్పుకుంది. తాను  నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నాని, ఈ సమయంలో వివాదాలు సృష్టించే వారికి దూరంగా ఉండేందుకే ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేస్తున్నట్టు రేణు తెలిపారు. అయితే, రేణు దేశాయ్‌ కాబోయే భర్త ఎవరన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.