రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి

10:23 - September 12, 2018

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్‌ నరసింహన్‌ను కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు కోరాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వున్న కేసీఆర్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని కూడా వీరు వ్యాఖ్యనించారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌, జానారెడ్డి, భట్టి, డీకే అరుణ, టీఎస్-టీడీపీ నేతలు ఎల్‌.రమణ, రావుల, రేవూరి, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, టీజేఎస్‌ నేత కోదండరామ్‌ తదితరులతో కూడిన విపక్ష పార్టీల మహాకూటమి ప్రతినిధులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీరిచ్చిన సిఫారసుకు గవర్నర్‌ నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో రాష్ట్రపతిని కలిసి సిఫారసు చేస్తామని చెప్పారు. అనంతరం ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని, రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు. 2004,2005 నాటి కేసుకు సంబంధించి జగ్గారెడ్డితోపాటు కేసీఆర్‌, హరీశ్‌రావు ప్రమేయం ఉందని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఎంఏ రషీద్‌ చెప్పాడన్నారు. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తే.. తెలియదంటూ దాటవేశారన్నారు. జగ్గారెడ్డి కంటే ముందుగా కేసీఆర్‌, హరీశ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.