జనసేన కి అంత సీన్ లేనట్టేనా? : జాతీయ సర్వేల్లో గల్లంతైన పవన్ పార్టీ

11:43 - January 31, 2019

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతూండటంతో జాతీయ మీడియా సంస్థలు రంగంలోకి దిగాయి. జనం నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ప్రతీ చానెల్ తనదైన రీతిలో సర్వే చేసింది. వరుసగా ఏపార్టీ సత్తా ఎలా ఉందో చెప్పాయి మీడియా చానెళ్ళు ఈ నేపథ్యంలో తాజాగా టైమ్స్ నౌ ఛానల్ కూడా సర్వే ఫలితాలను ప్రకటించింది. ఈ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో  వైఎస్సార్ సీపీ హవా కొనసాగుతుందంటూ రిపోర్ట్ ఇచ్చింది. ఏపీలో ఉన్న 25 లోక్ సభ స్థానాలకు గానూ 23 స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. టీడీపీకీ కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కుతాయని సర్వే స్పష్టం చేసింది. టీడీపీ భవిశ్Yఅత్తు ఏపీలొ కష్టమే అన్నంతగా తేల్చి పడేఅసింది టైమ్స్ నౌ  

ఇదే కాస్త షాకింగ్ అనుకుంటే జన సైనికులను నిరాశపరిచే విషయం ఇంకోకటి ఉంది. ఈ సర్వేలో  ఏపీలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న జనసేన పార్టీ విషయం లేనే లేదు. అసలు ఆ పార్టీ సంగతి ఏమిటి? అని చెప్పటం పక్కన పెడితే. కనీసం పోటీ ఇస్తుందని గానీ, పోటీలో ఉంటుందని గానీ చెప్పకుండా పక్కన పడేసారు. అసలు ఈ పార్టీ ఉన్నట్టు టైమ్స్ నౌ గుర్తించలేదా?, లేకపోతే జనసేనకి అంత సీన్ లేదు అని పక్కన పెట్టేసిందా అన్నదే ఇప్పుడు అర్థం కాని విషయం. 

అయితే ఈ ఒక్క చానెల్ మాత్రమే కాదు జాతీయ ఛానల్స్ సర్వే ఫలితాలు వెల్లడైన ప్రతీ సందర్భంలోనూ జనసేన పార్టీ ఊసే కనిపించలేదు. కొన్ని రోజుల క్రితం రిపబ్లిక్ టీవీ వెల్లడించిన సర్వే ఫలితాల్లోనూ జనసేన పార్టీ పేరు లేదు. ఈ సర్వే ఫలితాలు వెల్లడైన ప్రతీ సందర్భంలోనూ జనసేన శ్రేణులు నిరాశకు లోనవుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. 

సొంత తప్పిదాలు కూడా ఈ పరిస్థితికి కారణం అయిఉండవచ్చు అనుకుంటున్న వాళ్ళూ లేకపోలేదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే ఇంతవరకూ ఇంఛార్జ్లను నియమించని పరిస్థితిలో ఆ పార్టీ ఉండటం పార్లమెంట్ స్థానాలకు ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాకపోవడం ఇలా అనేక పరిణామాలు జనసేనను కలవరపెడుతున్నాయి. ఏదేమైనా జాతీయ ఛానల్స్ విడుదల చేస్తున్న సర్వే ఫలితాల్లో జనసేనను విస్మరిస్తుండటం ఆ పార్టీ నేతల్లో అభద్రతా భావాన్ని మరింత పెంచుతోంది.