మద్యనిషేదం డిమాండ్‌పై కదం తొక్కిన మహిళాలోకం...

11:41 - January 28, 2019

మద్యపానం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మద్యనిషేధం డిమాండ్‌పై మహిళాలోకం కదం తొక్కింది. '  బీరు బేడ, నీరు బేకు '  అనే బ్యానర్‌పై మద్య నిషేధ ఆందోళన్ (ఎంఎన్ఏ) సంస్థ ఈనెల 19న చిత్రదుర్గలో ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.9 గ్రామాల్లో పర్యటించి ఆల్కహాల్ వినియోగం వల్ల తలెత్తే ప్రమాదాలపై ప్రజలతో ముఖాముఖీ జరుపుతోంది. కర్ణాటకలో మధ్యనిషేధం డిమాండ్‌పై 2016లో ఎంఎన్ఏ ఏర్పటయింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని 23జిల్లాలకు చెందిన సుమారు 2,500 మహిళలు బెంగళూరు విధాన సభకు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. సిద్ధ గంగ మఠం వద్ద ఆదివారం జరిగిన ప్రజాసదస్సు అనంతరం మాండ్య, మైసూరు,రామనగర, ఛామరాజ్ నగర్, తుంకూరుకు చెందిన మహిళలు ఈ పాదయాత్రలో వచ్చి చేరారు. రోజుకూ 20కిలోమీటర్లు చొప్పున 200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి విధాన సౌధకు చేరుతారు. తమ పాదయాత్రలో మద్యం దుష్పరిణామాలు, మద్యనిషేధం అవసరంపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నట్టు ఉద్యమ కార్యకర్త ఒకరు తెలిపారు. దారిపొడవునా బహిరంగ సభలు నిర్వహిస్తున్నామన్నారు. క్యాడిగెరె, హోసూరు, నిత్యానంద ఆశ్రమ, జగగొండన హల్లి, తావర కెరె, సిర, చిక్కనహల్లి, సీబీ టెంపుల్, తుంకూరు, సిద్ధ గంగ మఠ్, ఆది శంకరాచార్య మఠ్, కులవనహల్లి, టి.బెగుర్, డాసనపుర, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, యశ్వంతపూర్ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. కాగా 30కి పైగా సంస్థలు ఎంఎన్ఏ డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నారు.